
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎందుకు అంత అసహనం? విజయవాడ వరదల విషయంలో తన ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిసి పోయిందన్న కోపమా? వరద బాధితుల శాపనార్థాలు రాష్ట్రమంతా మారుమోగిపోతున్నాయన్న ఉక్రోషమా? కేవలం రాజధాని ప్రాంతంలో వరద సమస్యల గురించి మాట్లాడితేనే.. ఆయన వారిని పూడ్చేయాలి అనడం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ఇది భావ్యమా? అక్కడితో ఆగినా బాగుండేది.. కానీ బాబుగారు తన అసహనం, ఉక్రోషం అన్నింటినీ వెళ్లగక్కేలా ‘‘వారిని సంఘ బహిష్కరణ’’ చేయాలని కూడా అనేశారు.
నలభై ఏళ్లకుపైగా ప్రజా జీవితంలో ఉన్న బాబు లాంటి వ్యక్తి ఇంత ఘోరంగా మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని పూడ్చి పెడుతుండడం ధర్మమేనా? మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వేసిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక... ఎదురుదాడికి దిగితే ప్రజలకు సంతృప్తి చెందుతారా? వరద సహాయ చర్యల్లో విఫలమైన విషయాన్ని కప్పిపుచ్చేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు అధికార వర్గం వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం ఆరంభించిందని అనుకోవాలా?
ఆంధ్రప్రదేశ్ పరిణామాలు ప్రజలను కలవరపరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యవహార సరళి పూర్తి అభ్యంతరకరంగా ఉందని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వరద ప్రాంతాలలో పర్యటించినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం, తమ బాధలు వెళ్లబోసుకోవడం.. గతంలో వైసీపీ ప్రభుత్వం తమను సమర్థంగా ఆదుకున్న విషయాలను గుర్తు చేసుకోవడం బాబుకు అస్సలు నచ్చడం లేదని అనిపిస్తోంది.
ప్రజలు తమ కష్టాలు కన్నీళ్లతో జగన్‌కు వివరిస్తూంటే ప్రభుత్వ క్రియా రాహిత్యం బయటపడిపోతుంది మరి. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు తమ విమర్శలకు పదును పెడుతున్నారు. విజయవాడకు వరద ముప్పు మొత్తానికి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లే కారణమన్నట్టుగా వారు చేస్తున్న వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివి. ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చి బాబు తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఆయన దగ్గర లేవు.
బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ షట్టర్లను ఆకస్మికంగా ఎత్తివేయడం వల్లే విజయవాడ ప్రజలు వరదలలో మునిగిపోవలసి వచ్చిందా? లేదా? అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు జవాబు ఇవ్వడం లేదు. కేవలం కృష్ణా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు మునగకుండా ఉండడానికే ఇలా రెగ్యులేటర్ గేట్లు ఎత్తారన్నది జగన్ అభియోగం.అయితే బుడమేరుకు పడిన గండ్ల వల్ల వరద వచ్చిందని ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే పత్రికలోనే ముంపునకు కారణం రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వేయడమేనని కథనాలు రావడంతో చంద్రబాబుకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. అయినా సరే.. జగన్ పైనే విమర్శలు ఎక్కుపెట్టి మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు.
ప్రజలకు వరద గురించి ముందుగా హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అయిందన్న జగన్ మరో ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి జవాబు రావడం లేదు. ప్రజల కోసమే తాను అమరావతిలోని తన ఇంటి నుంచి కలెక్టరేట్‌కు బస మార్చానని చెప్పేందుకు బాబు ముందు ప్రయత్నించారు కానీ.. ముంపునకు గురవడం వల్ల మార్చాల్సి వచ్చిందని వైసీపీ చెప్పడంతో బాబు గారు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఈ సందర్భంలోనూ... ‘‘అందరి ఇ్లళ్లలోకి నీరు వచ్చాయి..నా ఇంట్లోకి నీరు వచ్చింది ..అయితే ఏంటట?’’ ఆయన దబాయించే కార్యక్రమమే చేశారు. అదే క్రమంలో అమరావతి మునిగిందని కొందరు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని కూడా చెప్పుకోచ్చారు.
పైగా అలా అన్నవారిని అక్కడే ముంచాలని, అమరావతిలో పూడ్చాలని, గతంలో స్మశానం అన్నారని, వారిని సంఘ బహిష్కరణ చేయాలని ముఖ్యమంత్రి అనడం ఏ మాత్రం పద్దతిగా లేదు. ఎవరినైనా పూడ్చి పెట్టడం అంటే పరోక్షంగా చంపమని చెప్పడమే అవుతుంది కదా! సంఘ బహిష్కరణ చేయాలని చెప్పడం నేరం కాదా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తపరుచుకునే అధికారం ఉంటుంది. వాటిలో ఏమైనా అసత్యాలు ఉంటే ఖండింవచ్చు. వారిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అలా అని వారిని చంపి పూడ్చేసే హక్కు ఎవరికి ఉండదు.
అమరావతి రాజధానిలో పలు ప్రాంతాలు భారీ వర్షాల వల్ల నీట మునిగిన మాట వాస్తవం కాదా? హైకోర్టు, సచివాలయం ఎందుకు పూర్తి స్థాయిలో పని చేయలేకపోయాయి? అవన్ని ఎందుకు! చంద్రబాబు ఇల్లు ఉన్నది అమరావతి రాజధానిలో కాదా? ఆయన ఇంటిలోకి వరద చేరిందని ఆయనే అంగీకరించారు కదా? అయినా ఎందుకు బుకాయిస్తున్నారు? అమరావతి గురించి మాట్లాడితేనే పూడ్చి పెడతారా? దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.అమరావతిలో మునిగిన వివిధ ప్రాంతాలను చూపుతూ వీడియోలు పెడుతున్నారు. ఎంతమందిని పూడ్చిపెడతారు? సంఘ బహిష్కరణ చేస్తారూ? మరి సూపర్ సిక్స్ పేరుతో అబద్దపు హామీలు ఇవ్వడాన్ని ఏమనాలి? అని కొంతమంది అడుగుతున్నారు.
జగన్ ప్రభుత్వంపై తమకు మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి అరాచకంగా అనేక అసత్య కథనాలు ప్రచురించినప్పుడు వారిని సమర్ధిస్తూ చంద్రబాబు ఎలా మాట్లాడారు? అప్పుడు ఎవరైనా ఆ అబద్దాల గురించి ప్రస్తావించి ఈనాడు, ఆంధ్రజ్యోతి లను విమర్శిస్తే అమ్మో పత్రికా స్వేచ్చను అడ్డుకుంటారా? అని చంద్రబాబు ప్రశ్నించేవారు. ఆ రోజుల్లో భూమి టైటిలింగ్ యాక్ట్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేశారా? లేదా? ఒకటి కాదు.. ఎన్ని రకాలుగా జగన్ ప్రభుత్వాన్ని ఆ మీడియా వేధించింది? అప్పుడు వాటన్నిటి సమర్ధించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే అలవాటు ప్రకారం మాట మార్చేశారు. సాక్షి మీడియాపై విరుచుకుపడుతున్నారు.
ఈనాడు, జ్యోతి వంటి మీడియాల ద్వారా వరదలపై కూడా తనకు అనుకూలంగా అధిక శాతం ప్రచారం చేయించుకున్న చంద్రబాబు జాతీయ మీడియాను కూడా మేనేజ్ చేయగలిగారు. అయినా సాక్షి మీడియా మాత్రం ప్రజల పక్షాన నిలబడి కథనాలు ఇస్తుండడంతో, టీవీలలో ప్రజల ఆర్తనాదాలు ప్రసారం చేస్తుండడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. సాక్షి మీడియా కనుక లేకపోతే వరదలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు బయట ప్రపంచానికి తెలియకుండా పోయేవి. ఇంత మంది మరణించిన సంగతి కూడా తెలిసేది కాదు. అందువల్లే చంద్రబాబులో ఈ ప్రస్టేషన్ అన్న విశ్లేషణలు వస్తున్నాయి.
వరదలలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గాను సడన్ గా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎప్పుడో టిడిపి ఆఫీస్ పై జరిగిన దాడికి సంబంధించి, ఇప్పుడు కేసులు పెట్టి దళిత నేతను అరెస్టు చేసింది. గతంలో హత్య కేసులో ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేస్తే, బీసీ నేతను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు దళిత నేతను ఒక చిన్న కేసులో అరెస్టు చేశారు.
పెద్ద సంఖ్యలో పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేశారు. విజయవాడలో వరదలలో పోలీసుల సేవలను వినియోగించుకోకుండా దళిత నేతను అరెస్టు చేసి కక్ష సాధిపు చర్యలకు దిగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పనికట్టుకుని వరదల సమస్య ఉన్నప్పుడే ఈ అరెస్టు జరగడం గమనార్హం.చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగాను, అధికారంలోకి రాగానే మరో రకంగాను వ్యవహరించడం,మాట్లాడడం అలవాటే.ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ను ఆయన కొనసాగిస్తున్నారు.
- కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.