సమాచార శాఖ డీడీ సెల్ నుంచి నగ్న వీడియోలు
తెరిచేందుకు యత్నించగా పలు వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వర్డ్..
పార్ట్–2 ఉందంటూ నకిలీ ఏపీకే ఫైళ్లు
తన ఫోన్ హ్యాక్ అయ్యిందని వివరణ ఇచ్చిన డీడీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా సమాచార శాఖ డీడీ వేలాయుధం ఫోన్ నుంచి కొన్ని నగ్న చిత్రాలు పలు వాట్సాప్ గ్రూపులకు వచ్చాయి. గురువారం జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సమాచార శాఖ డీడీ పేరిట కుప్పం మీడియా గ్రూపులో వేలాయుధం మొబైల్ నంబరు నుంచి ఇద్దరు మైనర్ల అశ్లీల చిత్రాలు అప్‌లోడ్ అయ్యాయి. వీటిని తెరిచేందుకు ప్రయత్నించిన అందరి మొబైళ్ల నుంచి పలు వాట్సాప్ గ్రూపులకు అశ్లీల చిత్రాలు వెళ్లిపోయాయి. దీంతో పలువురు పాత్రికేయులు వేలాయుధంకు ఫోన్ చేసి చెప్పడంతో మేల్కొన్న ఆయన.. వాటిని తొలగించారు.
తన ప్రమేయం లేకుండా ఇవి గ్రూపుల్లోకి వచ్చాయని, తన ఫోన్ హ్యాక్ అయ్యిందని వివరణ ఇచ్చారు. విషయం కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కొన్ని అశ్లీల చిత్రాలు రావడం, 19 నిముషాలున్న పూర్తి పార్ట్–2 వీడియో కోసం కింది లింకును క్లిక్ చేయమని మెసేజ్ రావడం, వచ్చిన అశ్లీల చిత్రాలను చూసిన వాళ్లు పార్ట్–2 కోసం ఏపీకే ఫైళ్లను క్లిక్ చేయడంతో వారి పేరిట గ్రూపులకు ఫార్వర్డ్ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితినంతా వేలాయుధం చిత్తూరు ఎస్పీకి వివరించారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు.


