కాకినాడ : అతిథి మర్యాదలకు గోదారోళ్లకు పేరుంది. దీనిని నిలబెట్టేలా పెరవలిలో కొత్త అల్లుడికి 220 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయటం ఆకట్టుకుంది. పెరవలికి చెందిన ఆగర్తి వెంకట కృష్ణారావు, స్వరూపారాణి దంపతుల కుమార్తె భాగ్యశ్రీ లక్ష్మికి హైదరాబాద్‌కు చెందిన బొడ్డు భార్గవ్‌సాయితో ఐదు నెలల కిందట పెళ్లి జరిగింది. పండగకు అత్తింటికి వచ్చిర భార్గవ్‌సాయికి మకర సంక్రాంతి రోజున ఇలా వడ్డించారు. తానెప్పుడూ ఇన్ని వంటలు చూడలేదని, పేర్లు కూడా వినలేదని ఆయన ఆ«శ్చర్యంగా చెప్పారు.

పొట్టిగిత్త బండి.. అదిరిందండి
సంక్రాంతి అంటేనే రైతు పండగ. తొలకరి పంట చేతికి అందిన తర్వాత రైతులు చేసుకునే పెద్ద పండగ ఇదే. కనుమ పండగ సందర్భంగా కొమరగిరిపట్నంలో రైతు మెట్ల చినకాపు పొట్టి గిత్తల బండికి పూజ నిర్వహించి శుక్రవారం ఊరేగించారు. ప్రస్తుతం కాడెద్దులు మచ్చుకైనా లేని తరుణంలో పొట్టిగిత్తలతో ఊరేగింపు నిర్వహించడం ఆశ్చర్యపరిచింది. సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోతున్న తరుణంలో ఇలాంటి దృశ్యాలే మళ్లీ జీవం పోస్తాయి.
– అల్లవరం


