మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటి ఏర్పాటుకు అనుమతి
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది! ప్రైవేట్ మద్యం దుకాణాలు, బార్లను అడ్డగోలుగా టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు, ఆ అడ్డగోలు దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా అనుమతులు జారీ చేస్తోంది. ఊరూవాడ బెల్టుషాపులతో మద్యాన్ని ఏరులై పారిస్తోంది చాలక నకిలీ మద్యం తయారీని రాష్ట్రంలో కుటీర పరిశ్రమలా మార్చేసింది. ఇప్పటికే మద్యం ధరల పెంపు, బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటీ) రద్దు చేయగా.. తాజాగా మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు తలుపులు బార్లా తెరిచింది. తద్వారా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ బీరు తయారీకి అనుమతులిచ్చేసింది. పర్యాటకం ముసుగులో పక్కాగా కథ నడిపించింది. ఈ మేరకు చట్ట సవరణ చేసి, తమ అస్మదీయులకు కాసుల పంట పండించడానికి మార్గం సుగమం చేసింది.
నిబంధనలు సవరించి మరీ..
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రాఫ్ట్ బీరు ఉత్పత్తి చేసే మైక్రో బ్రూవరీలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఏర్పాటు చేయాలి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విధానానికి బాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. బ్రూవరీలను మునిసిపల్ కార్పొరేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఎక్కడైనా ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తూ నిబంధనలను సవరించింది. మునిసిపల్ కార్పొరేషన్ పరిధి దాటి 5కి.మీ.లలో ఏర్పాటు చేసుకోవచ్చంది. త్రీ స్టార్ హోటళ్లు, అంతకంటే ఉన్నతస్థాయి హోటళ్లు, పర్యాటక కేంద్రాలైతే ప్రదేశంతో నిమిత్తం లేకుండా ఎక్కడ ఉన్నా మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు అనుమతిని ఇచ్చేసింది. ఇంకా చెప్పాలంటే.. రాష్ట్రంలో ఎక్కడైనా సరే బ్రూవరీలను ఏర్పాటు చేసి బీరు ఉత్పత్తి చేసేందుకు పచ్చ జెండా ఊపింది. ఈమేరకు జీవో 21 జారీ చేసింది.
నాడు డిస్టిలరీలు.. నేడు మైక్రో బ్రూవరీలు
గతంలోనూ చంద్రబాబు ఇదే రీతిలో తమ అస్మదీయులు, బినావీులు, టీడీపీ నేతల కుటుంబాలకు అడ్డగోలుగా మద్యం డిస్టిలరీల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేసింది. 2019 నాటికి రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే, వాటిలో 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ఉన్న ఇతర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య ఒక్కటి కూడా కొత్త డిస్టిలరీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ డిస్టిలరీలు, బ్రూవరీల ఏర్పాటు పేరుతో దందాకు తెరతీసింది.
అందుకే మైక్రో బ్రూవరీలను ఎక్కడైనా ఏర్పాటు చేసేందుకు చట్ట సవరణ చేసింది. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ముసుగులో టీడీపీ నేతలు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బ్రూవరీలు ఏర్పాటు చేయనున్నారు. అందుకు వత్తాసు పలుకుతూ చంద్రబాబు సర్కారు బ్రూవరీల ఏర్పాటుకు తలుపులు బార్లా తెరిచింది. లైసెన్సులు కూడా ప్రభుత్వం టీడీపీ నేతలకే ఇవ్వనుందని ఎక్సైజ్ శాఖ వర్గాలే చెబుతున్నాయి. తద్వారా టీడీపీ మద్యం సిండికేట్‌కు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైందన్నది మరోసారి స్పష్టమైంది.


