భార్య మృతదేహంతో 36 గంటలు పడిగాపులు
విశాఖ కేజీహెచ్‌లో ఆదివాసీ గిరిజనుడికి దారుణ అనుభవం
అంబులెన్స్ లేక ఇక్కట్లు..స్పందించని యంత్రాంగం
మహారాణిపేట: నిరుపేద ఆదివాసీ మహిళ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు వారి కుటుంబం నరకయాతన అనుభవించింది. అంబులెన్సులు అందుబాటులో లేక దాదాపు రెండు రోజులు నానా ఇబ్బందులు పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం నిర్మతి గ్రామానికి చెందిన కూడ రత్నకుమారి (34)కి ఈ నెల 6వ తేదీన చెట్టు మీద పడడంతో తల, ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా గురువారం తెల్లవారుజామున చనిపోయింది. మెడికో లీగల్ కేసు కావడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. శవ పంచనామా చేయడానికి పోలీసులు 24 గంటల తర్వాత శుక్రవారం ఉదయం వచ్చారు. వారు నివేదిక ఇచ్చాక పోస్టుమార్టం పూర్తయింది.
36 గంటల పాటు మార్చురీ వద్ద మృతురాలి కుటుంబం పడిగాపులు కాసింది. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం 4.15కు రత్నకుమారి మృతదేహాన్ని రమేష్‌కు అప్పగించారు. సుదూరాన ఉండే తమ గ్రామానికి రత్నకుమారి మృతదేహాన్ని తరలించడానికి తిప్పలు పడ్డారు. సంక్రాంతి కావడంతో కేజీహెచ్ సిబ్బంది, అధికారులు ఫోన్లకు అందుబాటులోకి రాలేదు. రత్నకుమారి భర్త రమేష్ రెండు రోజుల పాటు అందరినీ బతిమాలుకున్న వైనం చూపరులను కదిలించింది. ప్రైవేట్ అంబులెన్సుల వారు రూ.20 వేల వరకు అడిగారు. అంత మొత్తం భరించలేక బాధితులు కన్నీరుపెట్టుకున్నారు. కేజీహెచ్ ఎస్టీ సెల్ ఏర్పాటు చేసిన వాహనంలో బయలుదేరారు. 6 గంటలు ప్రయాణించి పొద్దుపోయాక రమేష్ ఇంటికి చేరాడు.
అందుబాటులో లేని వాహనాలు..
కేజీహెచ్‌లో గిరిజనుల కోసమే రెండు అంబులెన్సులను ప్రత్యేకించారు. కానీ, వీటిలో ఒకటి రిపేరులో ఉంది. మరొకటి అందుబాటులో లేదు. ఈ వాహనానికి డ్రైవర్ లేరని సమాచారం. గిరిజనుల కోసం, ముఖ్యంగా దూరప్రాంతాల వారి కోసం ప్రత్యేకంగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


