జనాన్ని బాదింది మీరు కాదా..బాబూ!  | Sakshi
Sakshi News home page

జనాన్ని బాదింది మీరు కాదా..బాబూ! 

Published Wed, May 18 2022 11:03 AM

Chandrababu Naidu Cheated AP People - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప : తన పాలనలో రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా బాది అష్టకష్టాలపాలు చేసింది చంద్రబాబు. అలాంటి ఆయన  తగుదునమ్మా అని ఇప్పుడు జనరంజక పాలన సాగిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై బాదుడే బాదుడు పేరుతో దుమ్మెత్తి పోయడానికి జిల్లాకు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తీరుపై అటు విశ్లేషకులు, పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు.  

చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి సైతం కనికరించలేదు. ప్రభుత్వం ఏమాత్రం చేయూతనివ్వకపోవడంతో రైతాంగం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంది. టీడీపీ హయాంలో జిల్లాలో సంక్షేమంతోపాటు అభివృద్ధిని అటకెక్కించారు.  

జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ ప్రాజెక్టుల పరిధిలోని సాగునీటి వనరుల పెండింగ్‌ పనులను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో సాగుకు చుక్కనీరు అందని పరిస్థితి. రైతులు, వ్యవసాయ కూలీలు సైతం పనులు దొరక్క వలసలు వెళ్లాల్సి వచ్చింది. తాగునీటికి జిల్లా ప్రజలు అల్లాడి పోయారు. పాలనా కాలంలో మిన్నకుండిపోయి తీరా ఎన్నికల సమయంలో స్టీల్‌ ప్లాంటు తెస్తున్నామని ప్రగల్బాలు పలికారు తప్ప దాని ఊసే లేకుండా పోయింది.  

చదవండి: (బిడ్డ పుట్టిన తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నట్టేట ముంచాడు)

బాబు హయాంలో జిల్లాలో ఒక్క పరిశ్రమ రాలేదు...ఒక్క ఉద్యోగం లేదు....ఉపాధి లేదు. అర్హులైన వారికి ఒక్క పక్కా గృహం కూడా నిర్మించిన పాపాన పోలేదు. జాతీయ రహదారులు, జిల్లా రహదారుల పనులను గాలికొదిలారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు మరింత దూరమయ్యాయి. ఆస్పత్రుల అభివృద్ధి లేదు. వైఎస్సార్‌ నెలకొల్పిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఇక పాఠశాలల అభివృద్ధిని  పట్టించుకోలేదు. ముఖ్యంగా అన్నదాతల కష్టాలను గురించి ఏనాడు ఆలోచించలేదు. సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సాయం ఇచ్చింది లేదు. మొత్తంగా వివక్షతో వైఎస్సార్‌ జిల్లా అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలారు.  

జిల్లాలో టీడీపీ భూస్థాపితం 
ప్రజలు టీడీపీని జిల్లాలో భూస్థాపితం చేశారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో ఆ పార్టీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు. పైపెచ్చు చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ తదితర స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీకి నామమాత్రపు స్థానాలు కూడా దక్కలేదు. ప్రజల ఛీత్కారంతోనే ప్రతిపక్ష పార్టీకి ఈ పరిస్థితి ఎదురైందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అధికారంలో ఉన్నన్నాళ్లు ఏనాడూ జిల్లాను, జిల్లా అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదు. అధికారం కోల్పోయాక ఇప్పుడు ఉనికి కోసం జిల్లాను ఉద్దరించినట్లుగా.. ప్రజారంజక పాలన సాగిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా జిల్లా పర్యటనకు రావడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నేడు చంద్రబాబు రాక   
కడప రూరల్‌:  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు చినరాజప్ప  మంగళవారం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కడపలోని డీఎన్‌ఆర్‌ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు బుధవారం జిల్లా పర్యటన సందర్భంగా కడప, కమలాపురంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. పార్టీ శ్రేణులు చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పోలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, లింగారెడ్డి ,పుట్టా సుధాకర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: (SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు)

సభా స్థలిని పరిశీలించిన చినరాజప్ప 
కమలాపురం: కమలాపురం పట్టణంలోని గ్రామ చావిడి వద్ద బుధవారం  చంద్రబాబు నాయుడి బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు సభా స్థలిని టీడీపీ నేత, మాజీ హోం మంత్రి చినరాజప్ప పరిశీలించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో చర్చించారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement