ఆరు అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం | Chandrababu confused Politics on six assembly seats | Sakshi
Sakshi News home page

ఆరు అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం

Mar 26 2024 5:05 AM | Updated on Mar 26 2024 1:08 PM

Chandrababu confused Politics on six assembly seats - Sakshi

పెండింగ్‌లో పెట్టిన స్థానాలపై గందరగోళం

పొత్తులో టీడీపీ సీట్లు 144.. ఖరారు చేసినవి 138 మాత్రమే

పి.గన్నవరం జనసేనకు బదిలీ.. అనపర్తిపై తేల్చని బీజేపీ

టీడీపీ సీట్లలో మిగతా ఆరు ఏవన్న దానిపై అనిశ్చితి

బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తేలలేదు

గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లతో బంతాట

రాజంపేట, జమ్మలమడుగులో ఏదన్నదీ తేలని వైనం

దర్శి, అనంతపురం అర్బన్‌లో అభ్యర్థుల కోసం పాట్లు

4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోనూ జాప్యమే

సాక్షి, అమరావతి: అసమ్మతి నేతల నిరసనలతో సతమతమవుతున్న టీడీపీలో కూటమి సీట్ల సర్దుబాటు మరింత గందరగోళంగా మారింది. పెండింగ్‌లో ఉంచిన ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరా­రులో పార్టీ అధినేత చంద్రబాబు అయోమయానికి గురవుతున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి 144, జనసేనకు 21, బీజేపీకి 10 స్థానాలు కేటా­యించారు. అయితే, బీజేపీ పోటీ చేసే 10 స్థానాలు ఏమిటన్నదీ ఇప్పటికే తేలలేదు.

చంద్రబాబు ఇప్పటివరకు 139 సీట్లలోనే టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే అన్ని వర్గాలు వ్యతిరేకించడంతో పి గన్నవరం అభ్యర్థి రాజేష్‌ను పోటీ నుంచి తప్పించి ఆ స్థానాన్ని జనసేనకు ఇచ్చారు. తాజాగా అభ్యర్థిని ప్రకటించిన అనపర్తి సీటును బీజేపీకి ఇవ్వజూపుతున్నారు. అయితే, అనపర్తిలో బీజేపీ పోటీపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మిగిలిన ఆరు సీట్లలో బీజేపీకి ఏవి వెళ్తాయో తెలియదు.

‘సీమ’లో సీట్ల తంటా
ప్రధానంగా రాయలసీమలో బీజేపీకి కేటాయించే సీట్లపై మల్లగుల్లాలు పడుతున్నారు. గుంతకల్లు, ఆలూరు, ఆదోని సీట్లలో బీజేపీ పోటీ చేసే స్థానంపై గందరగోళం నెలకొంది. టీడీపీలోకి ఫిరాయించిన గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దాన్ని బీజేపీతో ముడిపెట్టి పెండింగ్‌లో పెట్టారు. ఒకవేళ ఆ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాల్సి వస్తే జయరాం సీటు గల్లంతైనట్లే. అక్కడి ఇన్‌ఛార్జి జితేంద్ర గౌడ్‌ కూడా టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నారు. ఆలూరు స్థానం కూడా సీట్ల సర్దుబాటు జాబితాలో ఉంది. దీంతో అక్కడా అభ్యర్థిని ఖరారు చేయలేదు.

జమ్మలమడుగు స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లు చెబుతున్నా అదీ తేలలేదు. ఆదినారాయణరెడ్డి కోసం ఆ సీటును బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరుగుతుండడంతో అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి, ఆయన కుటుంబానికే చెందిన భూపేష్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబంలో గొడవల నేపథ్యంలో రాజంపేటను బీజేపీకి ఇస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో రాజంపేట టీడీపీ నేతలు బత్యాల చెంగల్రాయుడు, ఇతర నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సీట్లలో బీజేపీకి ఏది ఇస్తారనే దానిపై ప్రతిష్టంభన ఏర్పడింది. సీట్ల సర్దుబాటు నేపథ్యంలోనే అనంతపురం అర్బన్‌ స్థానంలోనూ చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరోవైపు ప్రకాశం జిల్లా దర్శిలో అభ్యర్థి దొరక్క ఎవరైనా రాకపోతారా అని ఎదురుచూస్తున్నారు.

చీపురుపల్లి, భీమిలిపై అనిశ్చితి
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోనూ చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్నారు. ఓడిపోయే చోట పోటీ చేసేందుకు సీనియర్‌ నేతలు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అక్కడి ఇన్‌ఛార్జి నాగార్జున  ఒప్పుకోవడంలేదు. దీంతో ప్రస్తుతం టీడీపీలో చీపురుపల్లి స్థానంపై ఉన్నంత టెన్షన్‌ మరే స్థానంలోనూ లేదు. విశాఖ జిల్లా భీమిలి స్థానాన్ని మొదట జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరిగినా, ఇప్పుడు అది టీడీపీకే రావడంతో అక్కడ అభ్యర్థి ఖరారుపై చంద్రబాబు ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతున్నారు.

6 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులేరీ?
మరోవైపు పొత్తులో పోటీ చేయాల్సిన 17 ఎంపీ సీట్లలో ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం స్థానాలకు అభ్యర్థుల కోసం ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నారు. విజయనగరం సీటును కళా వెంకట్రావుకు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నా, ఆయన అంగీకరించడంలేదని తెలుస్తోంది. అనంతపురం సీటు కోసం జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌ గట్టిగా పట్టుపడుతున్నా దానిపైనా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కడప, కర్నూలు సీట్లలో అభ్యర్థుల కోసం ఇంకా వెదుకులాట కొనసాగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement