చంద్రబాబు డైరెక్షన్‌.. బ్రహ్మారెడ్డి యాక్షన్‌ | Chandrababu And Yellow Gang Conspiracy At Palnadu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు డైరెక్షన్‌.. బ్రహ్మారెడ్డి యాక్షన్‌

Dec 18 2022 3:43 AM | Updated on Dec 18 2022 8:12 AM

Chandrababu And Yellow Gang Conspiracy At Palnadu - Sakshi

సాక్షి, నరసరావుపేట: దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు మాచర్ల ఘటనలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజలను, రాజకీయ పరిశీల­కులను ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ వాళ్లే రాళ్లు, మారణాయుధాలతో దాడులకు పాల్పడి.. వైఎస్సార్‌సీపీ బీసీ నేతలను తీవ్రంగా గాయపరిచి.. పట్టణ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి.. తీరా తమపైనే వైఎస్సార్‌­సీపీ వర్గాలు దాడికి దిగాయని ఆందోళనలకు తెరలేపడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా నిలిచింది. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగింది.

ఈ నేపథ్యంలో క్యాడర్‌ను కాపాడుకునేందుకు ప్రతిప„క్ష పార్టీ పడరాని పాట్లు పడుతోంది. ఇందులో భాగంగా ఏదో ఒక వివాదం సృష్టించి.. చంద్రబాబు మొదలు కార్యకర్త వరకు రచ్చ చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఏడాది కిందట హత్యకు గురైన చంద్రయ్య, జాలయ్య ఘటనలో సైతం ప్రభుత్వానికి, వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా టీడీపీ నానా యాగీ చేసింది. ఇంత చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ ఉనికి కాపాడుకోవాలనే దింపుడు కల్లం ఆశతో కుట్ర రాజకీయాలకు తెర లేపింది.

ఇలాంటి రాజకీయాలను పెంచి పోషించడంలో ఆరితేరిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇందుకు మాచర్లను వేదికగా ఎంచుకున్నారు. తను అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి సరిగ్గా పనికొస్తాడని గమనించి ఫ్యాక్షన్‌  నేత జూలకంటి బ్రహ్మారెడ్డి భుజంపై చేయి వేశారు. ఒక పథకం ప్రకారం బాబు డైరెక్షన్‌ చేస్తుంటే.. జూలకంటి అమలు చేస్తున్నారు. ఇతన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నియమించినప్పటి నుంచి చోటుచేసుకున్న వరుస సంఘటనలు చూసి స్థానికులు ‘ఇదేం ఖర్మ మనకు’ అని వాపోతున్నారు. ప్రతి దానికీ రాజకీయ రంగు పులుముతున్న టీడీపీ, చంద్రబాబు ఉనికి పాట్ల రాజకీయం చూసి విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు.

ఇదీ జూలకంటి నేపథ్యం..
2001 మార్చి 10న దుర్గి పోలీస్‌స్టేషన్‌లో కండీషన్‌ బెయిల్‌పై సంతకాలు చేసేందుకు వెళ్తున్న పులుసు నాగిరెడ్డి, సాంబిరెడ్డి, అతని కొడుకు కోటిరెడ్డి, మరో నలుగురిని లారీతో ఢీకొట్టించి.. కత్తులు, బాంబులతో దాడి చేయించి వెంటాడి మరీ బ్రహ్మారెడ్డి హత్య చేయించారు. ఏడుగురిని హత్య చేసిన కేసులో బ్రహ్మారెడ్డి ప్రధాన నిందితుడిగా కేసు నమోదైంది.

ఈ నెల 14వ తేదీన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ ముందు తాగి రాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్న యువకులపై కేసు నమోదు చేసినందుకు బ్రహ్మారెడ్డి తన వర్గంతో వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకువెళ్లి, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. పోలీస్‌స్టేషన్, రహదారిపై వెళుతున్న వాహనాలు అడ్డగించి, భయాందోళన కలిగించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. 2014, 2019 సాధారణ ఎన్నికలు, 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బ్రహ్మారెడ్డి ప్రవర్తించడంతో మరో నాలుగు కేసులు నమోయ్యాయి.

నిన్నటి ఘటనతో కలిపి మొత్తంగా ఏడు కేసులున్నాయి. ఫ్యాక్షన్‌  నేపథ్యం ఉండి కొన్ని ఏళ్లపాటు నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్న బ్రహ్మారెడ్డిని చంద్రబాబు తిరిగి రప్పించడంతో, మాచర్ల ప్రాంతంలో తిరిగి ఫ్యాక్షన్‌ కు తెరలేపుతున్నారు. బ్రహ్మారెడ్డి తన పాత అనుచరులతో వర్గాలను ప్రోత్సహిస్తున్నాడు. నిత్యం ఉద్రిక్తత నెలకొనేలా ఇతని వ్యవహారం ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. 20 ఏళ్లుగా ఒక్క ఫ్యాక్షన్‌  హత్య జరగని మాచర్లలో బ్రహ్మారెడ్డి ఇన్‌చార్జిగా వచ్చిన ఏడాది కాలంలోనే నిత్యం ఏదో ఒక అలజడి రేగుతోందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

పల్నాడు అభివృద్ధికి అడ్డంకులు
చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడు పల్నాడు అభివృద్ధికి పని చేయలేదు. మూడున్నరేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసింది. పల్నాడు ప్రత్యేక జిల్లా, వరికపూడిసెల ప్రాజెక్టు, మెడికల్‌ కళాశాల, జాతీయ, రాష్ట్ర రహదారులు, పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మన్నన అందుకుంటోంది. దీంతో టీడీపీ ఉనికి కోల్పోతుండటంతో ప్రభుత్వంపై కక్షకట్టిన చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారానికి తెరలేపారు.

అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు.. మాచర్లపై ఏమాత్రం చంద్రబాబుకు ప్రేమ, బాధ్యత ఉన్నా, ఫ్యాక్షన్‌  నేపథ్యం ఉన్న బ్రహ్మారెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బ్రహ్మారెడ్డికి నెల నెలా ఖర్చులకు డబ్బులు ఇచ్చి మరీ చంద్రబాబు పల్నాడులో ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement