
విభజన హామీలను వెంటనే అమలు చేయాలని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నవారిని దుర్మార్గులుగా చూస్తామంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు.
సాక్షి, విజయవాడ: విభజన హామీలను వెంటనే అమలు చేయాలని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నవారిని దుర్మార్గులుగా చూస్తామంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం.. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన హామీలు అమలైతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.
‘‘గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న వారు తాజాగా ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చారు. రాష్టం బాగుపడటం, భవిష్యత్ కూడా ముఖ్యమే. తెలుగు జాతి హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాంప్రమైజ్ కావొద్దు. ఏపీకి ప్రత్యేక హోదా తేవాలి. కేంద్రం నుంచి హామీలు తీసుకోవడం కాదు.. అమలయ్యేలా చూడాలి’’ అని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

చంద్రబాబు, జనసేన విభజన అంశాలపై మాట్లాడలేదు.. నయనో, భయనో ప్రత్యేక హోదా తీసుకురావాలి.. పోలవరం పై కుట్ర జరుగుతుంది.. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు ఇవ్వాలి’’ అని చలసాని అన్నారు.
‘‘ఏపీలో మీడియాపై నిషేధం సరికాదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిషేధించిన ఛానల్స్‌ను పునరుద్ధరించాలి’’ చలసాని కోరారు.