తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తోంది: విజయసాయిరెడ్డి

Central Government Cheating Telugu People Says Vijaya Sai Reddy - Sakshi

న్యూఢిల్లీ : ఎనిమిదేళ్లైనా కేంద్రం విభజన చట్టం హామీలను నెరవేర్చలేదని, తెలుగు ప్రజలందరికీ ద్రోహం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బీజేపీ పక్షపాత ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కేంద్ర అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘ ప్రభుత్వ రంగ సంస్థను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలి. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రాన్ని కోరాం. బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరాం. దిశ బిల్లును క్లియర్‌ చేయాలని కోరాం. సీఆర్డీఏ, ఏపీ ఫైబర్‌, రథం తగలబడ్డ అంశాలపై సీబీఐ విచారణ కోరాం.. ఫిరాయింపుల అంశంపై కేంద్రం వైఖరి సరిగాలేదు. అనర్హత పిటిషన్‌పై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో అన్ని అంశాలను లేవనెత్తుతాం.

పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌పై కేంద్రం ఉద్దేశపూర్వక కాలయాపన చేస్తోంది. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలి కోరాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాం. విశాఖ ఉక్కును లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలి. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరాం. ప్రత్యేక హోదాపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు కోరాం. బియ్యం సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరాం. పోలవరం, ప్రత్యేక హోదా అంశాల్లో కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. పెండింగ్‌లో ఉన్న దిశ బిల్లును క్లియర్‌ చేయాలని కోరాం. తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.6 వేలకోట్ల విద్యుత్‌ బకాయిలు రావాలి. విద్యుత్‌ బకాయిలను ఇప్పించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి’’ అని అన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై పోరాడతాం: మిథున్‌రెడ్డి
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై పోరాడతాం. విభజన చట్టం అంశాల అమలుపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతి కోరాం.. ఏపీ ప్రజయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడం. పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రజల వాణిని వినిపిస్తాం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top