నా ముందున్న రెండు వ్యూహాలు అవే: కిషన్‌రెడ్డి

ప్రధాని మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు
సికింద్రబాద్ ప్రజలకు కృతజ్ఞతలు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేబినెట్ విస్తరణలో భాగంగా నరేంద్ర మోదీ బీజేపీ నేత కిషన్ రెడ్డికి పదోన్నతి కల్పించారు. గతంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఈ సారి కేబినెట్ హోదా కల్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాపై విశ్వాసం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తాను" అని తెలిపారు.
"నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమిత్ షా శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇందుకుగాను వారికి కృతజ్ఞుడనై ఉంటాను. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలకు ధన్యవాదాలు తేలియజేస్తున్నాను’’ అన్నారు కిషన్ రెడ్డి.
"నవభారత నిర్మాణం కోసం, నరేంద్రమోదీ స్వప్నం సాకారాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ అమరవీరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతానికి నా ముందున్నాయి. నన్ను ఆదరించి పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు కిషన్ రెడ్డి.