
ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు చెప్పాలి
చంద్రబాబు సర్కారుకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సవాల్
ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వకపోవడం బాధాకరం
సాక్షి, అమరావతి: హైకోర్టు విచారణలో ఉన్నప్పటికీ.. దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చి ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన సవాల్ చేశారు. అలాగే, రాష్ట్రంలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా, ఎన్‌సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) హోల్డర్లు ఆర్బీఐ డైరెక్ట్ డెట్ మాండేట్ ద్వారా రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధిని పొందవచ్చనే వాస్తవాన్ని అంగీకరించి.. ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర ఖజానాను అప్పగించే స్థాయికి ఎందుకు దిగజారిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తిన అంశాలు, జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను జతచేస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో బుగ్గన ఏమన్నారంటే..
ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్ల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలేదనే ఆరోపణలు నిరంతరం వస్తున్నప్పటికీ.. వాటిని ప్రభుత్వం విస్మరించడం శోచనీయం. ఈ అంశంపై ప్రజలకు ఎటువంటి వివరణలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం.
ఎన్‌సీడీ బాండ్ల జారీలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటాన్ని ప్రస్తావిస్తూ జాతీయ మీడియాలో విస్తృతమైన కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ఆ తప్పును ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని లేదా వివరణ ఇస్తుందని ఎవరైనా ఆశిస్తారు. కానీ, ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేయడంపై నోరుమెదపకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది.
ఇది ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకపోవడానికి.. పారదర్శకతపై కరువైన చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. నిజానికి.. హైకోర్టులో ఈ అంశం విచారణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రెండు విడతలుగా ఎన్‌సీడీ బాండ్లు జారీచేసి రూ.9 వేల కోట్లు అప్పుచేసింది.
ఎన్‌సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తుల (రుణదాతలు)కు రూ.1,91,000 కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టింది. అంతేకాదు.. ఆ అప్పును ఏపీడీఎంసీ కట్టలేకపోతే ఆర్బీఐలో రాష్ట్రానికి ఉన్న ఖాతా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రాష్ట్ర అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా వారికి రావాల్సిన మొత్తాలను డ్రా చేసుకునే అధికారం కల్పించింది.
ఇలా రాష్ట్రంలో ఇంతముందెన్నడూ లేని రీతిలో ప్రైవేటు వ్యక్తులకు ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై అజమాయిషీ ఇవ్వడం వాస్తవం కాదా? రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చే స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలి.