మరో 25 మందితో  బీఎస్పీ మూడో జాబితా 

BSP third list with 25 others - Sakshi

ఇప్పటి వరకు 88 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) మూ డో విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ శనివారం ప్రకటించారు. 25 మందితో కూడిన ఈ జాబితాతో ఇప్పటి వరకు బీఎస్‌పీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కు చేరింది. ప్రజల మధ్యన ఉండే వారినే బీఎస్‌పీ అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నానని, సిర్పూర్‌ను ఆంధ్ర వలస దారుని పాలన నుంచి విముక్తి కల్పించడమే తన ధ్యేయమన్నారు. 10న నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. 

కేసీఆర్‌ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి 
2018 శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసిన సీఎం కేసీఆర్‌ అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆర్‌టీఐ కింద గజ్వేల్‌ ఆర్‌డీవో నుంచి తాము తీసుకున్న వివరాల్లో కేసీఆర్‌ ఆస్తుల వివరాలు లేవని తెలిపారు. ఆస్తుల వివరాలు వెల్లడించని నామినేషన్‌ను ఆమోదించిన అప్పటి రిటర్నింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్‌ను మళ్లీ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై తాము మొదటి నుంచీ హెచ్చరిస్తున్నామనీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టుల భద్రతపై కూడా తమకు అనుమానాలున్నాయని, జనావాసాల మధ్య కట్టిన ఈ ప్రాజెక్టులకు ఏమైనా జరిగితే భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు తప్పవని ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top