సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ను విభజించాలని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అనంతరం, తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై తలసాని తాజాగా స్పందించారు. సాక్షితో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ..‘సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకోవడంతో నాకేమీ అభ్యంతరం లేదు. ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు అలా వస్తాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులను గౌరవించే వ్యక్తిని నేను. సికింద్రాబాద్ ప్రాంతం మా ఎమోషన్. సికింద్రాబాద్‌ను మార్చట్లేదు అనుకుంటూనే ఇక్కడి ప్రాంతాలన్నీ మల్కాజ్‌గిరిలో కలుపుతున్నారు. పదవిలో ఉన్నామని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ది చెబుతారు.
గతంలో కేసీఆర్ శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి పోలీసు కమిషనరేట్లు చేశారు. ఇప్పుడు ఏ పోలీసు స్టేషన్ ఎవరికీ వస్తుందో అర్ధం కానీ పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవి అన్నీ అబద్దాలే. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్‌లో కలిపింది వాస్తవం కాదా?. 17వ తేదీన నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల 5న హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు దరఖాస్తు చేస్తే మల్కాజ్‌గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం ఇచ్చారు.
సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్‌పల్లి సర్కిల్‌లోకి చేర్చారు. భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిది. మన అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీని ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుంది. భారీ ర్యాలీలో అన్ని సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి’ అని పిలుపునిచ్చారు.


