
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్‌లోనే చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారని సంచలన ఆరోపణలు చేశారు. గురు దక్షిణలో భాగంగానే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై బీఆర్‌ఎస్ పోరాటం చేస్తే.. కాంగ్రెస్ మొద్దు నిద్ర పోతోంది. మధ్యాహ్నం మేం ప్రెస్‌మీట్ పెడితే రాత్రి ఉత్తమ్ లేఖ రాశారు. బ్యాక్ డేట్ వేసి మీడియాకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. బనకచర్లపై బొంకుడు రాజకీయాలు బంద్ చేయాలి. రేవంత్, ఉత్తమ్ కలిసిన తర్వాతే కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ విషయాన్ని జనవరిలో బీఆర్‌ఎస్ బయటపెట్టింది.
సీఎం రేవంత్‌కు బేసిన్ల గురించి కనీసం అవగాహన లేదు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్‌లో అని రేవంతే చెప్పారు. రేవంత్ టెక్నికల్‌గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. కానీ, ఆయన హృదయం టీడీపీలోనే ఉంది. బనకచర్లను ఆపే చిత్తశుద్ది రేవంత్‌కు లేదు. బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు జెండా ఊపారు. నాడు బాబు బ్యాగులు మోసి బ్యాడ్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నారు. నేడు అదే బాబు కోసం బనకచర్ల బొంకుమెన్‌గా మారిపోయారు. చంద్రబాబును ప్రజాభవన్‌లో కలిశాక చీకటి ఒప్పందం కుదిరింది. గురు దక్షిణలో భాగంగానే చీకటి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్ మరణశాసనం రాశారు.
తెలంగాణ పుటల్లో సీఎం రేవంత్ ద్రోహిగా మిగిలిపోతారు. రేవంత్ చిల్లర మల్లర రాజకీయాలు మానేసి రాష్ట్రం కోసం పోరాడాలి. నిన్నటి ప్రజంటేషన్‌లో అన్ని అబద్దాలే. రేవంత్ అబద్ధాలను బీఆర్‌ఎస్ చీల్చి చెండాడుతుంది. కేసీఆర్ మీదు ముఖమంత్రి రేవంత్ నిందలు మోపుతున్నారు. సీఎం వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోస్తోంది. మాకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యం. బనకచర్లపై ప్రజంటేషన్ ఇస్తే అన్ని పార్టీలను పిలవాలి కదా?. అహంకారంతో మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు.
