
తెలంగాణ సాధన లక్ష్యంగా 2001లో ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ 14 ఏళ్ల పోరాటం తర్వాత 2014లో రాష్ట్రం ఏర్పాటైంది. ఉద్యమ సమయంలో ఎన్నికలను రాష్ట్ర సాధన అస్త్రాలుగా సంధించిన టీఆర్‌ఎస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా బరిలోకి దిగింది. 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాష్ట్రాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది.
తాము స్వీయ రాజకీయశక్తిగా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో బలం పుంజుకోవాల్సిన అవసరముందని తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు పోటీ చేసి అధికారం దక్కించుకున్న టీఆర్‌ఎస్ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రూపంలో మరోమారు 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి తమ లక్ష్యంగా ప్రకటించిన గులాబీపార్టీ 2023 మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఎన్నికల్లో ‘కేసీఆర్ భరోసా‘ పేరిట మేనిఫెస్టోలోని 17 అంశాలతో ఓటర్లకు చేరువయ్యేందుకు బీఅర్‌ఎస్ ప్రాధాన్యం ఇస్తోంది.
2014 సమగ్రాభివృద్ధి
వినూత్న పాలన సంస్కరణలతో సామాజిక మార్పు కోసం నిజాయతీ, నిబద్ధతతో నిరంతరం పనిచేస్తామని టీఆర్‌ఎస్ ప్రకటించింది. సామాజిక ఉద్యమ కార్యకర్తలతో రాష్ట్ర, జిల్లాస్థాయిలో ప్రజా కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల రూపకల్పనలో సూచనలు స్వీకరిస్తామని, అమలు తీరును కూడా ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయని పేర్కొంది. దీని కోసం రాష్ట్ర సచివాలయంలో ఒక విభాగం ఏర్పాటు చేస్తామని, పౌర సమాజం కనుసన్నల్లో పారదర్శక, జవాబుదారీ విధానంతో ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తామని హామీ ఇచి్చంది. నీటి పారుదల, విద్యుత్, వ్యవసాయ, విద్య, వైద్య ఆరోగ్యం, సంక్షేమం సహా 36 ప్రధాన అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్‌ఎస్ విడుదల చేసింది.
2018 పెరిగిన సంపద పేదలకు
రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తమకు తొలిసారిగా దక్కిన అధికారంతో తెలంగాణ పునర్మిర్మాణ ప్రక్రియ ప్రారంభించినట్టు ప్రకటించింది. నాలుగున్నరేళ్ల ప్రస్థానంలో గణనీయమైన అభివృద్ధి సాధనతో దేశం దృష్టిని ఆకర్షించినట్టు పేర్కొంది. ఓవైపు బాలారిష్టాలను దాటడంతోపాటు, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను కూడా అధిగమించినట్టు పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, కల్యాణలక్ష్మి వంటి 76 పథకాలను ప్రజల అవసరాల మేరకు కొత్తగా ప్రవేశ పెట్టినట్టు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగిందని, పెరిగిన సంపదను పేదలకు పంచుతామని 2018 మేనిఫెస్టోలో పేర్కొంది.
2023 పెట్టింది మేమే.. పెంచేది మేమే
తెలంగాణ ఏర్పడేనాటికి ఉన్న పరిస్ధితులను అర్థం చేసుకుని అధ్యయనం తర్వాత అనేక పాలసీలు రూపొందించినట్టు ప్రకటించింది. తెలంగాణ బాగుకు సంపద పెంచి ప్రజలకు పంచాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నది. సంక్షేమానికి, అభివృద్ధికి తొమ్మిదిన్నరేళ్లలో సమ ప్రాధాన్యం ఇచ్చినట్టు ప్రకటించింది. ఆర్థిక, విద్యుత్, తాగునీరు, సాగునీరు వ్యవసాయ, దళిత, సంక్షేమ, విద్య, ఆరోగ్య, పారిశ్రామిక, గృహ నిర్మాణ రంగాల్లో ఇప్పటికే రూపొందించుకున్న విధానాలను కొనసాగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అమల్లో ఉన్న పాలసీలను అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇస్తూనే, కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని 2023 మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ విడుదల చేసింది.
2014 ఎన్నికల మేనిఫెస్టో
- ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, చెరువుల పునరుద్ధరణ
- మిగులు విద్యుత్, కొత్తగా పది థర్మల్ విద్యుత్ కేంద్రాలు
- రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, 8గంటల విద్యుత్
- కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య, కొత్తగా గురుకుల పాఠశాలలు
- నియోజకవర్గానికి ఒకటి చొప్పున వంద పడకల ఆస్పత్రులు
- బలహీనవర్గాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
- వృద్ధులు, వితంతువులకు రూ.వేయి, దివ్యాంగులకు రూ.1500 పెన్షన్
- ఐదేళ్లలో రూ.50వేలకోట్లతో ఎస్సీ సంక్షేమం, దళితులకు 3 ఎకరాల భూమి
- ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీలుగా తండాలు
- బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.వేయి కోట్లు, రూ.25వేల కోట్లతో బీసీల అభివృద్ధి
- కొత్తగా 24 జిల్లాలు, విశ్వనగరంగా హైదరాబాద్
2018 ఎన్నికల మేనిఫెస్టో
- ఆసరా పెన్షన్లు రూ.వేయి నుంచి రూ.2016కు పెంపు, దివ్యాంగులకు రూ.3016
- వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితి 65 ఏళ్ల నుంచి 57కు తగ్గింపు
- నిరుద్యోగ యువతకు రూ.3016 భృతి, రైతులకు రూ.లక్ష రుణమాఫీ
- రైతుబంధు సాయం ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10వేలకు పెంపు
- డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు సొంత స్థలాలు ఉన్న వారికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షలు
- ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు, బీసీ, మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం
- అగ్రవర్ణ పేదల కోసం ప్రత్యేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు
- రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు. కంటి వెలుగు ద్వారా పరీక్షలు
- ప్రభుత్వ ఉద్యోగాలకు సరైన వేతనం, ఉద్యోగుల పదవీ విరమణ పరిమితి 58 నుంచి 61ఏళ్లకు
2023 ఎన్నికల మేనిఫెస్టో
- అర్హులైన మహిళలకు రూ.3వేల భృతితో ‘సౌభాగ్యలక్ష్మీ’
- రైతుబీమా తరహాలో పేదలకు రూ.5లక్షల జీవిత బీమా
- ఆసరా పెన్షన్లు రూ.2016 నుంచి దశల వారీగా రూ.5వేలకు పెంపు
- దివ్యాంగుల పెన్షన్ రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంపు
- ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ .15లక్షలకు పెంపు
- రూ.400కే గ్యాస్ సిలిండర్, అన్నపూర్ణ పేరిట రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం
- పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు. ఉద్యోగులకు పాత పింఛన్ విధానం
- అసైన్డ్ భూములపై హక్కులు. అనాథ పిల్లలకు ప్రత్యేక పాలసీ.