సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది జాగ్రత్త అని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. బీఆర్‌ఎస్ జెండా ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ అని తమ పార్టీ జెండా గద్దెల్లో లేదని, ప్రజల గుండెల్లో ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం పార్టీ నేతలతో కలిసి హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడమే తన లక్ష్యం అంటూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి నేషనల్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ మీద ప్రేమ చూపుతున్న రేవంత్ అందులో నుంచి బయటకు వచ్చి ద్రోహం చేశాడు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడితే రేవంత్ మాత్రం బీజేపీ, చంద్రబాబుతో కలిసి ఉంటున్నాడు. కాంగ్రెస్ భూస్థాపితం అయితేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి’అని పేర్కొన్నారు.
సీబీఐ విచారణకు ఇస్తే అన్ని వివరాలు ఇస్తాం..
సింగరేణి సంస్థలో టెండర్లు, కాంట్రాక్టు సైట్ విజిట్ సర్టిఫికెట్ల జారీ సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితులు, సమీప బంధువుల కనుసన్నల్లో జరుగుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎంకు నిజాయితీ ఉంటే సింగరేణి టెండర్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడు తాము అన్ని వివరాలు ఇస్తామని చెప్పారు. ‘కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సహా దేశంలో ఎక్కడా లేని రీతిలో 2024లో రేవంత్ ప్రభుత్వం సింగరేణిలో సైట్ విజిట్ విధానం తెచ్చింది. ఈ విధానంలో మొదటి కాంట్రాక్టు రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీ శోధా కన్‌స్ట్రక్షన్స్‌కు తొలి టెండర్ దక్కింది. మరోవైపు గతానికి భిన్నంగా టెండర్లను 7 నుంచి 10 శాతం మేర అదనపు ధరలకు అప్పగిస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో కట్టబెట్టిన టెండర్లను కూడా రద్దు చేసి అధిక ధరలకు కట్టబెడుతున్నారు. వెంకటేశ్‌ఖని, శ్రీరాంపూర్ తదితర చోట్ల ఈ తరహా అక్రమాలు జరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి సింగరేణికి గతంలో బల్క్‌గా సరఫరా అయ్యే డీజిల్ విధానాన్ని రద్దు చేసి కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు అప్పగించారు’అని హరీశ్‌రావు ఆరోపించారు.
బొగ్గు టెండర్లను రద్దు చేయాలి
‘రెండేళ్లుగా సింగరేణి సంస్థను ఇన్‌చార్జి సీఎండీతో నడిపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించినట్లుగా కేవలం నైనీ బ్లాక్ టెండర్లతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని బొగ్గు టెండర్లను రద్దు చేయాలి. సైట్ విజిట్ విధానంతోపాటు డీజిల్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. రేవంత్, బీజేపీ నడుమ చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటి రెడ్డి నడుమ వాటాల పంచాయతీలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలి పశువులు అయ్యారు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.


