సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది ఏ వర్గానికి సంక్రాంతి పండగ సంతోషం లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పండగ ముందే మద్యం ధర పెంచారు.. భూముల విలువ కూడా పెంచేశారు.. భూములు కొనాలంటే షాక్ కొట్టేలా ఉన్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికీ యూరియా అధిక ధరకే దొరుకుతుంది’’ అంటూ మండిపడ్డారు.
‘‘విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 5వేల 600 కోట్ల బకాయిలు ఉన్నాయి. రెండు నెలల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు జీతాలు కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కిపోయిందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ కో ప్రాజెక్ట్ వైఎస్సార్‌సీపీ హయాంలోనే వచ్చింది. గ్రీన్ కో కంపెనీకి అభినందనలు. మేము పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించాం. రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేము భూములు ఇవ్వలేదు’’ అని బొత్స పేర్కొన్నారు.
..ఈ రెండేళ్లలో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది?. ప్రభుత్వం నుంచి ఎవరైనా సమాధానం చెప్పండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. గతంలో ఎప్పుడైనా గ్రామ బహిష్కరణ ఉందా..?. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..?. ఊరిలోకి వస్తే మనుషుల్ని చంపేస్తారా..?. దహన సంస్కారాలకు వెళ్లాలంటే ఆధార్ కార్డులు చూపించి వెళ్ళాలా?. పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా. ఇలాంటి ఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదు.
..సాల్మన్ హత్య అత్యంత దారుణం. ప్రజాస్వామ్యానికి మన దేశం తల్లి లాంటిది అని ప్రధాని మోదీ అంటున్నారు.. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..?. ప్రధాని రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ బహిష్కరణలపై కూడా స్పందించాలి. కూటమి పాలనలో ఏమి జరుగుతుందో ప్రధాని తెలుసుకోవాలి. సాల్మన్ హత్య అత్యంత దారుణం.. తీవ్రంగా ఖండిస్తున్నాం.. చంద్రబాబు.. ఇదేనా పరిపాలన..?
..ఏం చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్నావ్.. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సామాన్యులకు ఎక్కడా మేలు చేయడం లేదు. వైఎస్సార్ సంక్షేమ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. సంక్రాతి మూడు రోజులు.. ఏ టీవీ చూసినా.. కోడి పందాలే. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఎక్కడా అందుబాటులో ఉండటం లేదు. పరిశ్రమలతో మా హయాంలో జరిగిన ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు అవే ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి’’ అని బొత్స చెప్పారు.


