సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తాం

BJP Will Demolish Domes Of Telangana Secretariat: Bandi Sanjay - Sakshi

స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో బండి సంజయ్‌ మండిపాటు

సచివాలయాన్ని తాజ్‌మహల్‌ లాంటి సమాధిగా మార్చారు

మేం అధికారంలోకి వస్తే భారతీయ, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా చేస్తాం

బీఆర్‌ఎస్, ఎంఐఎం రెండు పార్టీలూ ఒక్కటే అని ఎద్దేవా

ఓల్డ్‌ బోయిన్‌పల్లి (హైదరాబాద్‌): ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే సచివాలయాన్ని తాజ్‌మహల్‌ లాంటి సమాధిలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయ గుమ్మటాలను కూల్చివేసి తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తామని దుయ్యబట్టారు. ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర­వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు.

ఓల్డ్‌బోయిన్‌పల్లి చౌరస్తాలోని 77, 78, 79 బూత్‌ పరిధిలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఅర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తాము అధికారంలోకి వస్తే భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామని తెలిపారు.

రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను, మం­దిరాలను కూల్చుతామన్నా కేటీఆర్‌కు దమ్ముంటే పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, జీహెచ్‌ఎంసీలో అధికారం పంచుకుంటున్న ఈ పార్టీలు అసెంబ్లీలో నాటకాలాడుతున్నాయని ఎద్దేవాచేశారు. సచివాలయాన్ని రూ.400 కోట్ల­తో నిర్మిస్తామని చెప్పి, రూ.1,500కోట్లతో తాజ్‌మహల్‌లా కట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 

ఉచితంగా విద్య, వైద్యం
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. ‘నిలువ నీడలేని వారికి ఇళ్లను కట్టిస్తాం. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా ఫసల్‌ బీమా యోజన అమలు చేస్తాం. కేసీఆర్‌ పాలనలో ఆయన కుటుంబం ఒక్కటే బాగుపడి సంపన్నమైంది. పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారారు’ అని చెప్పారు. మన బతుకులు బికారిగా ఉండాలా లేదా గల్లా ఎగురవేసి తెలంగాణవాదిగా సగర్వంగా తలెత్తుకునేలా ఉండాలా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ నెల 25 వరకు శక్తి కేంద్రాల ద్వారా స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను జాగృతపరిచేందుకు 11 వేల స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లను నిర్వహిస్తామని బండి వివరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ మేడ్చల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి మాధవరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top