ఐటీ దాడులకు బీజేపీకి సంబంధం లేదు 

BJP has nothing to do with IT attacks says kishan reddy  - Sakshi

దీపావళి తరువాత బీజేపీ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తాం 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన తడిబట్టలతో గొంతుకోసేలా తయారైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు ప్రజలపై కంటే మాఫియాపైనే ఎక్కువ నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ దున్నపోతులను తినే రకం అయితే... కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా ఏనుగులను తినే రకం అని విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో బీజేపీ తరపున పోటీచేసే లంకల దీపక్‌రెడ్డి (జూబ్లీహిల్స్‌), నవీన్‌కుమార్‌ (వికారాబాద్‌), శ్రీకాంత్‌రెడ్డి (సిద్దిపేట), మొగిలయ్య (నకిరేకల్‌), పూస రాజు (ముషీరాబాద్‌)కు బీ–ఫారాలను అందచేసిన సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.

దీపావళి తర్వాత ఈనెల 13వ తేదీ నుంచి బీజేపీ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తామని చెప్పారు. ఐటీ దాడులు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయని, వారున్నదే దాడులు చేయడానికని వ్యాఖ్యానించారు. ఆదాయ పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారని సమాచారం వచ్చిన వారిపై దాడులు చేస్తారని, ఆ దాడులకు బీజేపీకి, కేంద్రానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ముందే ఎలా తెలుసని నిలదీశారు. జనంలోకి వెళ్లకుండా, మాట్లాడకుండా కొన్ని సంస్థలు సెల్‌ఫోన్, కంప్యూటర్‌ల ముందు కూర్చుని సర్వే నివేదికలు ఇస్తున్నాయని, అవన్నీ దొంగ సర్వేలని కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. ఈ సర్వేలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

11న మోదీ.. : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈనెల 11న రాష్ట్రానికి వస్తున్నారని, ఆ తరువాత మరో రెండు మూడు సభల్లో పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top