వరుణ్‌కు మొండిచెయ్యి.. జితిన్‌కు పట్టం! | BJP Cuts Varun Gandhi Lok Sabha Ticket | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: వరుణ్‌గాంధీకి మొండిచెయ్యి.. జితిన్‌కు పట్టం!

Mar 25 2024 6:52 AM | Updated on Mar 25 2024 12:29 PM

BJP Cuts Varun Gandhi Lok Sabha Ticket - Sakshi

రంగుల పండుగ హోలీకి ముందుగానే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ ఎన్నికల వేడిని మరింత పెంచింది. యూపీలోని పిలిభిత్ స్థానం ఎవరికి కేటాయిస్తారన్న చర్చలకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఇక్కడి నుంచి జితిన్ ప్రసాద్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. 

పిలిభిత్ స్థానం వరుణ్ గాంధీకి కేటాయిస్తారా లేదా అనే దానిపై ఇన్నాళ్లూ పలు ఊహాగానాలు కొనసాగాయి. వాటికి ఇప్పుడు తెరపడింది. వరుణ్‌కు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. పిలిభిత్ లోక్‌సభ స్థానం గత నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఖాతాలోనే ఉంది. ప్రస్తుతం ఈ స్థానంలో వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్నారు. అయితే వరుణ్ గాంధీ చాలా కాలంగా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ తన గళం విప్పారు. అయితే ఇటీవల ఆయన పార్టీ విషయంలో కాస్త మెత్తబడ్డారు. దీంతో వరుణ్‌కు టికెట్‌ ఇస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 

బీజేపీ తొలి జాబితా విడుదలైన తర్వాత  పిలిభిత్‌ నుంచి పోటీ చేసేది వీరేనంటూ పలువురు పోటీదారుల పేర్లు చర్చకు వచ్చాయి. వారిలో ఒకరే జితిన్ ప్రసాద్. ఆదివారం రాత్రి వెలువడిన బీజేపీ జాబితాలో జితిన్ ప్రసాద్ పేరు కనిపించింది. దీంతో జిల్లాలో ఎన్నికల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. జితిన్ ప్రసాద్ ప్రస్తుతం పబ్లిక్ వర్క్స్ మంత్రిగా ఉన్నారు. ఆయన పిలిభిత్, లఖింపూర్, సీతాపూర్ తదితర జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. 

జితిన్ ప్రసాద్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో షాజహాన్‌పూర్ నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ధౌరహర స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో జితిన్‌ కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం జితిన్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement