ఎమ్మెల్యే భార్య ఓటమి.. జనసేనకు గట్టి ఎదురుదెబ్బ | Battula Balarama Krishna Wife Lost ZPTC Election | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే భార్య ఓటమి.. జనసేనకు గట్టి ఎదురుదెబ్బ

Nov 8 2026 8:57 AM | Updated on Nov 8 2026 9:01 AM

Battula Balarama Krishna Wife Lost ZPTC Election

సాక్షి, రాజమహేంద్రవరం: సొంత నియోజకవర్గంలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు పరిషత్‌ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే భార్య బత్తుల వెంకటలక్ష్మి జెడ్పీటీసీ అభ్యర్థి ఓటమి పాలవడం ఒక ఎత్తయితే, ఆయన సొంత గ్రామమైన గాదరాడలోనూ జనసేనకు ఆశించిన ఫలితాలు దక్కకపోవడం మరో ఎత్తు. ఇక నియోజకవర్గంలోని సీతానగరం, కోరుకొండ మండలాల్లోనూ వైఎస్సార్‌ సీపీ అద్భుత ఫలితాలు సాధించడంతో జనసేన రాజకీయ బలంపై చర్చ మొదలైంది. ఎమ్మెల్యే కుటుంబానికి సొంత నియోజకవర్గంలోనే ఓటర్లు గట్టి సందేశం ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎమ్మెల్యే భార్యకూ తప్పని ఓటమి 
రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం జెడ్పీటీసీ స్థానానికి జనసేన తరఫున బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి  పోటీ చేశారు. అయితే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు చేతిలో ఆమె 2,600 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే భార్య స్వయంగా బరిలో నిలిచినా ఓటర్లు వైఎస్సార్‌ సీపీ అభ్యరి్థకి పట్టం కట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గంలో అధికార పార్టీకి ఉన్న బలాన్ని, స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఈ ఫలితం ప్రతిబింబిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఓటమిని ఎమ్మెల్యే బత్తుల ఓటమిగానే చూడాలనే వాదన వినిపిస్తోంది.  

స్వగ్రామంలోనూ షాక్‌ 
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వగ్రామం కోరుకొండ మండలంలోని గాదరాడ. ఈ గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలుండగా ఒక స్థానంలో జనసేన, మరోచోట టీడీపీ పోటీ చేశాయి. అయితే జనసేనపై వైఎస్సా ర్‌సీపీ అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ పోటీ చేసిన స్థానంలోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యరి్థకి విజయావకాశాలు ఉన్నప్పటికీ రీకౌంటింగ్‌కు అధికారులు అంగీకరించలేదు. అందువల్ల ఆ స్థానం టీడీపీ గెలిచినట్టయింది. మొత్తంగా స్వగ్రామంలో రెండు స్థానాలనూ గెలుచుకోవాలన్న బత్తుల ఆశలకు గండిపడినట్లయింది. ముఖ్యంగా ఆ గ్రామంలో జనసేన ఓడిపోవడం ఎమ్మెల్యేకు భారీ షాక్‌గానే భావించాలి. ఎమ్మెల్యే సొంత ఊరిలోనే ఒక ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకోవడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  

వైఎస్సార్‌ సీపీ జోరు 
సీతానగరం మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు 12 చోట్ల విజయం సాధించారు. కూటమి అభ్యర్థులు ఎనిమిది స్థానాలకే పరిమితమయ్యారు. ఇందులో జనసేన పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేయగా ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన స్థానాల్లో ఓటమి చవిచూసింది. ఎమ్మెల్యే భార్య పోటీ చేసిన మండలంలోనే జనసేనకు ఇలాంటి ఫలితం రావడం ఆ పార్టీ నాయకత్వానికి ఆత్మపరిశీలన అవసరమనే సంకేతాలిస్తోంది. 

కోరుకొండ మండలంలో మొత్తం 23 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్సార్‌ సీపీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థులు 11 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ కూడా జనసేనకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. ఆ పార్టీ 12 స్థానాల్లో పోటీ చేయగా ఏడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మిగిలిన ఐదు స్థానాల్లో ఓటమి ఎదురైంది. ఎమ్మెల్యే స్వగ్రామం ఉన్న మండలంలోనే వైఎస్సార్‌ సీపీ ఆధిక్యం సాధించడం జనసేనకు రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా మారింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement