
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన రూ. 6 లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారో, ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో, నిధులు ఎక్కడి నుంచి తెస్తారో కాంగ్రెస్ సర్కార్ చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రం అప్పుల పాలైందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసిందని, ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆరు గ్యారంటీలు ఇచ్చిందన్నారు. రాష్ట్రం అప్పుల పా లైందని తెలిసీ ఆరు గ్యారంటీలు ఎలా ఇచ్చారు? ఆ అప్పులు ఎలా తీరుస్తారో ప్రజలకు కాంగ్రెస్ వివ రించి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం పార్టీ కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, గతంలోని డ్రగ్స్ కేసు ను కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు.
నయీం అక్రమ ఆస్తులు, వాటి డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టాలని, ఈ కేసును తవ్వితే అన్ని పార్టీల నాయకుల బండారం బయటపడుతుందన్నారు. ఇందులో బీఆర్‌ఎస్ నేతల ప్రమేయమే ఎక్కువగా ఉందని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థ తప్పిదాల వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా రని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా కాదా చెప్పా లన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయని, తెలంగాణ సమాజం ఆలోచించి బీజేపీని గెలిపించాలని కోరా రు. కాగా, తనకు ఈటలతో ఎలాంటి విభేదాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.