Sonia Gandhi: అశోక్‌ గెహ్లాట్‌కు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి.. ఆయన ఏమన్నారంటే?

Ashok Gehlot Denied That Sonia Gandhi Offered Party Chief Post - Sakshi

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ విముఖత చూపుతున్న నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే.. గాంధీ కుటుంబీకులే అధ్యక్ష పదవి చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు పట్టుబడుతున్నారు. ఈ తరుణంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టాలని సోనియా గాంధీ సూచించినట్లు వార్తలు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఆ వార్తలను కొట్టిపారేశారు అశోక్‌ గెహ్లాట్‌. 

‘ఈ విషయాన్ని నేను మీడియా ద్వారానే వింటున్నా. దీని గురించి నాకు తెలియదు. నాకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నా.’ అని గుజరాత్‌ పర్యటన సందర్భంగా విలేకరులతో వెల్లడించారు గెహ్లాట్‌. అయితే.. అశోక్‌ గెహ్లాట్‌తో సోనియా గాంధీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారని, పార్టీ బాధ్యతలను చేపట్టాలని సూచించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది.

సెప్టెంబర్‌ 20న పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్‌. అయితే, ఆ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ ఇష్టపడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తన ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల ఆ పదవిలో కొనసాగలేనని సోనియా గాంధీ చెబుతున్నారు. ఈ క్రమంలో గాంధీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఇటీవల దీనిపై అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ కార్యకర్తల సెంటిమెంట్లను రాహుల్‌ గాంధీ అర్థం చేసుకుని పార్టీ పదవిని స్వీకరించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ వల్లే సజీవంగా ప్రజాస్వామ్యం .. 32 ఏళ్లలో ఏ పదవీ చేపట్టని కుటుంబం అది!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top