‘ఖబడ్దార్‌’పై కలకలం | Sakshi
Sakshi News home page

‘ఖబడ్దార్‌’పై కలకలం

Published Fri, Dec 22 2023 4:47 AM

Argument between the two sides in the assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ గురువారం దారి తప్పింది. ‘ఖబడ్దార్‌’అంటూ కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య సభలో కలకలం సృష్టించింది. విపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యులు అంతే దూకుడుతో రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి ఆవేశంతో ప్రతి సవాళ్ళు విసరడం సభలో వేడిని మరింత పెంచింది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగాన్నే లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్‌ సభ్యుడు రాజగోపాల్‌ రెడ్డి వ్యంగా్రస్తాలు సంధించారు.

‘కిరోసిన్‌ దీపం కింద చదువుకున్న... కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి వేల కోట్లు ఎలా సంపాదించారు?’అని ప్రశ్నించారు. ప్రజల కోసమే తాను పార్టీ మారిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్‌కు జోకడం తప్ప, ఎదురు చెప్పలేని స్థితి మాజీ మంత్రిది అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు మూకుమ్మడిగా లేచి అభ్యంతరం చెప్పా రు.

ప్రతిగా అధికార పక్ష సభ్యులూ లేవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ సభ్యుడు పాడి కౌశిక్‌ రెడ్డి అధికార పక్షం వైపు వేలెత్తి చూపారు. పరస్పర వాగ్వాదం కొనసాగుతున్న తరుణంలోనే రాజగోపాల్‌రెడ్డి ‘పదేళ్ళు భరించాం.. ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. ఖబడ్దార్‌’అంటూ చేసిన హెచ్చరిక సభా వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. 

కొత్త వాళ్ళున్నారు... కాస్త జాగ్రత్త 
వాగ్వాదాల మధ్య మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి జోక్యం చేసకుని ‘ఈ సభ లో కొత్త వాళ్ళున్నారు. సభా మర్యాద కాపాడాలి. వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు, తిట్టుకోవడం మంచిది కాదు’అంటూ సలహా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. సభ లో ‘ఖబడ్దార్‌’అనే పదం వాడొచ్చా? అని బీఆర్‌ఎస్‌ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై రూలింగ్‌ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.

ఏం జరిగిందో పరిశీలిస్తానని, ఖబడ్డార్‌ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. ఆ తర్వాత సభ సర్దుమణిగింది. చర్చ కొనసాగుతుండగానే బీఆర్‌ఎస్‌ సభ్యులు సభలో లేకపోవడాన్ని గమనించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం కొద్ది సేపటికే బీఆర్‌ఎస్‌ సభ్యులు సభలోకి ప్రవేశించారు. 

Advertisement
Advertisement