
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఆయన ధాటిగా మాట్లాడటమే కాదు.. ప్రతిపక్షాన్ని సెంటిమెంటు ఆయుధంతో దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షం బలహీనతను ఆయన నొక్కి మరీ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు 175 సీట్లలో పోటీచేయగలరా? అని జగన్ సవాల్ విసురుతున్నారు.
జగన్ ప్రసంగంలోని వివిధ అంశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతారన్నది సందేహమే. తెనాలిలో జరిగిన రైతు భరోసా -పి.ఎమ్.కిసాన్ సాయం పంపిణీ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. రాజకీయంగా టీడీపీ, జనసేనల బలహీనతలపై దెబ్బ కొడుతూ వారు శాసనసభ ఎన్నికలలో మొత్తం అన్ని సీట్లకు పోటీచేయలేని నిస్సహాయ స్థితిని ప్రజల ముందుంచారు.
టీడీపీ, జనసేనల బలహీనత తెలిసేలా..
2019 శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఒంటరిగా పోటీచేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జనసేన పరిస్థితి మరీ దయనీయం. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. వామపక్షాలు, బీఎస్పితో ఆయన పొత్తు పెట్టుకుని కూడా ఈ పరాభవానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జనసేనతో కలిస్తే ఏమైనా రాజకీయ లబ్ధి కలుగుతుందా అన్న ఆశతో టీడీపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు ఇందుకోసం తన మంత్రాంగం కొనసాగిస్తున్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా తాను గెలిస్తే చాలన్నట్లుగా టీడీపీతో ఎలా జట్టుకట్టాలా అని తంటాలు పడుతున్నారు. ఒకవేళటీడీపీతో కలిస్తే జనసేనకు కేవలం 25 నుంచి సీట్ల లోపే ఇవ్వవచ్చన్న అంచనా ఉంది. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్‌కు అవమానమే. అయినా దానిని భరించడానికి ఆయన సిద్ధపడుతున్నారని అంతా భావిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నందున పవన్ తన వారాహి యాత్రను కూడా వాయిదా వేసుకున్నారని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిని పవన్ కళ్యాణ్ ఖండించలేదు. అంటే జనసేన ఎటూ 175 సీట్లలో పోటీచేసే అవకాశమే లేదు. అసలు ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాలలో క్యాడరే లేదు.
సాయం కోసం టీడీపీ ఎదురుచూపు..
ఇక టీడీపీకి అన్ని నియోజకవర్గాలలో క్యాడర్ ఉన్నా, బలం క్షీణించిపోవడంతో బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని ఎదురుచూస్తోంది. స్థానిక ఎన్నికలలో కేవలం 25 శాతం ఓట్లే రావడం వారికి తీవ్ర ఆశాభంగం కలిగించింది. అందువల్ల జనసేనతో కలిస్తే ఏమైనా పోటీ ఇవ్వగలుగుతామా? అన్నది వారి ఆలోచన. అందుకే జనసేనకు కొన్ని సీట్లు ఇస్తే 175 సీట్లలో పోటీచేసే పరిస్థితి టీడీపీకి ఉండదు. ఆ విధంగా టీడీపీ, జనసేనల బలహీనతను జనానికి తెలిసేలా చేయగలిగారు.
సీఎం జగన్‌కు అడ్వాంటేజ్..
మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని సీట్లకు పోటీకి సై అంటూ సవాల్. తద్వారా ప్రజలలో తమకు ఆదరణ ఉందన్న నమ్మకాన్ని ,అన్ని చోట్ల పార్టీ బలంగా ఉందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయగలుగుతోంది. ఆ కాన్ఫిడెన్స్ ప్రతిపక్షంలో కొరవడడం జగన్‌కు అడ్వాంటేజ్ అని చెప్పాలి. దీనికి సమాధానంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీతో కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయా? అని పిచ్చి ప్రశ్న వేశారు. 2014లో బిజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నాయకత్వం కోరినా జగన్ ఒప్పుకోలేదు. తాను ఒంటరిగా పోటీచేసి గెలవగలమన్న దమ్ము ఆయనకు ఉండడమే దీనికి కారణం 2014లో అధికారం రాకపోయినా, ఏ ఇతర పార్టీ పొత్తుకోసమో ఆయన తెలుగుదేశం మాదిరి అర్రులు చాచలేదన్న సంగతి సోమిరెడ్డి గ్రహించాలి.
జగన్ సెంటిమెంట్
ఇక ఇతర అంశాలలో జగన్ సెంటిమెంట్ పండించారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు టైమ్ లో 300కి పైగా కరువు మండలాలు ఉన్న స్థితిని ఆయన గుర్తు చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు తన తండ్రి హయాంలో కానీ పుష్కలంగా వర్షాలు పడ్డాయని సభలో పాల్గొన్న రైతులకు జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ఆ రోజులలో రెయిన్ గన్ అంటూ షో చేసి, వాటితోనే కరువును పొగొట్టినంత బిల్డప్ ఇచ్చేవారు.
అది వందల కోట్ల మేర దండగమారి ఖర్చుగానే మిగిలిపోయింది. దాంతో రైతులలో బలంగా ఒక అభిప్రాయం నాటుకుపోయింది. చంద్రబాబు పాలనలో కరువు తప్పదన్న భావన సర్వత్రా ఏర్పడింది. అదే జగన్ పాలన ఆరంభమైన సంవత్సరం నుంచి నాలుగేళ్లలో పుష్కలంగా వర్షాలు పడడం, నదులు పొంగిపొర్లడం, చెరువులు ,రిజర్వాయిర్లు నిండడంతో పంటలు బాగా పండుతున్నాయి. భూగర్భ జలాల మట్టం బాగా పెరిగింది. సాధారణంగానే వైఎస్సార్‌సీపీ నేతలు.. కరువు, చంద్రబాబు కవల పిల్లలని విమర్శిస్తుంటారు.
దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి జగన్ రైతుల సభలో చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో కరువు పరిస్థితులను తన స్పీచ్ లో గట్టిగా వినిపించారు. రైతులకు తన ప్రభుత్వం అమలు చేసిన వివిధ స్కీములను ఆయన వివరించారు. తదుపరి రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ పేదలు, రైతులకు , పెత్తందార్లకు మధ్య యుద్దం జరగబోతోందని ఆయన చెప్పారు. తాము హామీ ఇచ్చినట్లు భరోసా డబ్బు పంపిణీ చేశామని, అదే చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేస్తామని చివరికి వారిని మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాగే పేదల పిల్లలకు ఆంగ్ల మీడియంలో చదువు చెప్పిస్తున్న తనకు, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్న పెత్తందార్లకు మధ్య యుద్దం జరగబోతోందని ఆయన చెబుతున్నారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా..
ఇవన్నీ సెంటిమెంట్ తో కూడిన అంశాలే అవుతాయి. జగన్ ప్రభుత్వం స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేయడమే కాకుండా ఆంగ్ల మీడియం కూడా ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అదే టైమ్‌లో ఆ పార్టీలు జనంలో పలచన అయ్యాయి. ఫలితంగా తాము ఆంగ్ల మీడియంకు వ్యతిరేకం కాదని ఆ పార్టీల నేతలు చెప్పవలసి వస్తోంది.
ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ విషయంలో జగన్ ధైర్యంగా ముందడుగు వేశారు. ఇది ఆయనకు సానుకూల పరిణామంగా ఉంది. అన్నింటినీ మించి వందల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని చంద్రబాబుకు, ఇచ్చిన హామీలలో 98.5 శాతం అమలు చేసిన తనకు మధ్య పోటీ జరగబోతోందని, హామీలు నెరవేర్చినవారిని తిరిగి ఎన్నుకోకపోతే, భవిష్యత్తులో ఎవరూ ఎన్నికల మానిఫెస్టో అమలుపై దృష్టి పెట్టరని జగన్ హెచ్చరించారు. మాట తప్పే వ్యక్తిగా చంద్రబాబును ఫోకస్ చేయడంలో జగన్ సఫలం అవుతున్నారు. అదే ధైర్యంతో జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. తెనాలి సభకు పెద్ద ఎత్తున హాజరైన రైతులు, ఇతర వర్గాల ప్రజలు, వారు ఆయా సమయాలలో జగన్ స్పీచ్ కు వ్యక్తం చేసిన స్పందన గమనిస్తే జగన్‌కు జనంలో తిరుగులేదన్న అభిప్రాయం మరోసారి కలుగుతుంది.
-హితైషి