
లేని స్కామ్‌లను సృష్టించి ప్రభుత్వ అధికారులపైనా కక్షసాధింపు
ఏపీ వైపు చూడాలంటేనే భయపడుతున్న బ్యూరోక్రాట్స్
వేమిరెడ్డి మైనింగ్ దోపిడీ రూ.1,000 కోట్లు
లీజు ముగిసిన మైన్స్‌లోనూ అక్రమంగా తవ్వకాలు
సుప్రీంకోర్టు మార్గదర్శకాలూ బేఖాతర్
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్ అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు(బారకాసు): ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం లేని స్కామ్‌లు సృష్టించి కక్ష సాధింపులకు దిగుతోందని ధ్వజమెత్తారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. ఏపీలో పనిచేయాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
మైనింగ్ మాఫియాను పోషిస్తున్న చంద్రబాబు
నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మైనింగ్ మాఫియాను బాబు పెంచి పోషిస్తున్నారు. జిల్లాలో దాదాపు 180 మైన్‌లు ఉంటే అందులో కేవలం 25 నుంచి 30 మాత్రమే నడుస్తున్నాయి. వేమిరెడ్డి వల్ల అనేక క్వారీలు ఇంకా మూతపడే ఉన్నాయి. వేమిరెడ్డి కంపెనీ పెట్టుకోవడం తప్పా అంటూ టీడీపీ నాయకుడు బీద రవిచంద్రయాదవ్ వత్తాసుగా మాట్లాడారు. తాను తప్ప ఇంకెవరూ మైనింగ్ వ్యాపారాలు చేసుకోకూడదన్న ఎంపీ దురాశ వల్ల నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు.
260 మందికిపైగా క్వార్ట్జ్æ ఎగుమతిదారులుంటే ఎంపీ వేమిరెడ్డికి చెందిన కంపెనీ ఒక్కటే వ్యాపారం చేయడం వెనుక మతలబు ఏంటి? ఎవరైనా ఎక్స్‌పోర్ట్ చేసుకుందామనిపోతే వారిని బెదిరిస్తున్నారు. ఎంపీ మైనింగ్ అక్రమాలపై నేను ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కొంతమందిని పిలిపించుకుని మాట్లాడుకున్నారని తెలిసింది. లోకల్ మైన్లన్నీ ఎంపీ కంపెనీకి చేయాలట. ఎక్స్‌పోర్టర్ చైనా కంపెనీకి అమ్ముకుంటామని వాళ్లతో చెప్పారు. ఇదే జరిగితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ కావడం తథ్యం.
లీజు గడువు ముగిసిన వాటిలో అక్రమ మైనింగ్
ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఫ్యాక్టరీ పెడతానని ఇంకా శంకుస్థాపన చేయకుండానే వేల టన్నులు చైనాకి ఎక్స్‌పోర్టు చేస్తున్నాడు. 50 ఏళ్ల పరి్మషన్ గడువు ముగిసిపోయిన ఏడెనిమిది మైన్స్, పట్టా భూములను తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమంగా మైనింగ్ చేస్తూ ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైనే దోపిడీకి స్కెచ్ వేశాడు. ఇవి నిజంకాదని నిరూపిస్తే ఎంపీకి క్షమాపణలు చెప్పడానికీ సిద్ధం.
మా హయాంలో పారదర్శకంగా మైనింగ్
గత ప్రభుత్వంలో ఎవరి మీద ఎలాంటి ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా మైనింగ్ చేసుకోనిచ్చాం. టాప్ టెన్ ఎక్స్‌పోర్టర్ల లిస్ట్ చూస్తే అందులో టీడీపీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మా ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇంతకన్నా వేరే రుజువులు అవసరం లేదు.