కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎర్నాకుళం జిల్లాలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఎన్డీఏలోని ‘ట్వంటీ20’ అనే పార్టీకి ట్విస్ట్ ఎదురైంది. ట్వంటీ20 పార్టీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. దీంతో వారు పోటీకి అనర్హులు.
పెరుంబవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ‘ట్వంటీ20’ అభ్యర్థిగా నటి లక్ష్మీ ప్రియ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో తాజాగా నిర్వహించాలనుకున్న రోడ్‌షోను చివరి నిమిషంలో రద్దు చేశారు.
మొదట రోడ్ షో రద్దు లక్ష్మీ ప్రియకు ఆరోగ్య సమస్యలే కారణమని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని అన్నారు. లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు రావడంతో దీనిపై ‘ట్వంటీ20’ పార్టీ సీనియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం నిజమైతే పెరుంబవూర్‌లో మరో అభ్యర్థిని నిలబెట్టాల్సి రావచ్చని తెలిపారు. ఇవాళ లక్ష్మీ ప్రియ స్థానంలో జీబీ వర్గీస్ పతిక్కల్ను ట్వంటీ20 పార్టీ పెరుంబవూర్ అభ్యర్థిగా ప్రకటించింది.
లక్ష్మీప్రియ ప్రస్తుత నివాసం త్రిపుణితుర సమీపంలోని కారింగచిరలో ఉంది. ఆమె పేరు ఓటర్ల జాబితాలో నిజంగానే లేదని తెలిసింది. ఆమె గతంలో నివసించిన త్రిక్కాకరలో కూడా ఓటరు జాబితాలో ఆమె పేరు లేదు. దీనిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.
లక్ష్మీ ప్రియ వివాదం మరవకముందే..
లక్ష్మీ ప్రియ ఘటనను మరవకముందే అదే ట్వంటీ20 పార్టీలో అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఎట్టుమనూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నటి వీణా నాయర్‌ను ప్రకటించారు. అయితే, ఆమె పేరు కూడా ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని బయటపడింది. ఆమె స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
వీణా నాయర్ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తాను పోటీ చేయడం లేదని వీణా నాయర్ తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇద్దరు సినీ నటీమణులను అభ్యర్థులుగా ప్రకటించడం ఎన్డీఏకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, త్రిపుణితుర నియోజకవర్గంలో నటి అంజలిని ట్వంటీ20 పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అక్కడ ఆమె ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది.


