breaking news
five state election 2026
-
భార్య సంగీతతో మరో చిక్కు..? విజయ్‌కు షాక్ తగలనుందా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ దాఖలు చేయబోయే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే పట్టుదలతో విజయ్ ఉండగా.. అయితే, ఆయన అసలు ఎన్నికల్లో నిలబడగలరా? అంటూ డీఎంకేలోని న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో అప్రమత్తమైన విజయ్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేంత తీవ్ర వ్యవహారంగా మారిందిఎన్నికల కేసుల్లో అనుభవం ఉన్న కొందరు డీఎంకే న్యాయవాదులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. "భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి తన ఆస్తుల వివరాలను దాచకూడదు. సమగ్రమైన అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి. ఆ అఫిడవిట్లో అభ్యర్థి తన పేరుతో ఉన్న చరాస్తులు, స్థిరాస్తులే కాకుండా.. భార్య, కుమారులు, కుమార్తెల పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాల నిల్వలు, ఆదాయపు పన్ను వివరాలన్నింటినీ సమర్పించాలి.ఇందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. ఈ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచుతారు. ఎవరైనా ఇందులో తప్పుడు సమాచారం, ఆస్తులను దాచడం వంటివి గుర్తిస్తే.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. అయితే, ప్రస్తుతం.. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం విజయ్ నామినేషన్ దాఖలు చేయడంలో అడ్డంకిగా మారవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆమె పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయి? బ్యాంకు నిల్వలు ఎంత? ఏవైనా అప్పులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు విజయ్ దగ్గర స్పష్టమైన సమాధానాలు ఉన్నాయా? అనే సందేహాలు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.విజయ్, ఆయన భార్య గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ కాలంలో ఆమె తన పేరు మీద, పిల్లల పేరు మీద గానీ ఏవైనా ఆస్తులు కొన్నారా? అప్పులు చేశారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా? వంటి వివరాలు విజయ్‌కు తెలిసే అవకాశం లేదు. తన భార్యతో సంప్రదిస్తేనే విజయ్ తన నామినేషన్లో సరైన వివరాలను పొందుపరచగలరు. కానీ, ప్రస్తుతం వారద్దరూ మాట్లాడుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది.అందుకే విజయ్ నామినేషన్ చట్టపరమైన చిక్కులు కలగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ నామినేషన్ దాఖలును మా సీనియర్ లాయర్లు నిశితంగా గమనిస్తారు, దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి’’ అని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దీనిపై విజయ్‌కు చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?. భార్యతో విడిగా ఉంటున్నందున కొత్తగా కొన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేనని చెప్పడానికి చట్టపరమైన వెసులుబాటు ఉందా? అని దానిపై విజయ్ సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
అభ్యర్థులుగా నటీమణులు.. ఓటర్ లిస్టులో పేర్లు మాత్రం..
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎర్నాకుళం జిల్లాలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఎన్డీఏలోని ‘ట్వంటీ20’ అనే పార్టీకి ట్విస్ట్ ఎదురైంది. ట్వంటీ20 పార్టీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. దీంతో వారు పోటీకి అనర్హులు.పెరుంబవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ‘ట్వంటీ20’ అభ్యర్థిగా నటి లక్ష్మీ ప్రియ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో తాజాగా నిర్వహించాలనుకున్న రోడ్‌షోను చివరి నిమిషంలో రద్దు చేశారు. మొదట రోడ్ షో రద్దు లక్ష్మీ ప్రియకు ఆరోగ్య సమస్యలే కారణమని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని అన్నారు. లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు రావడంతో దీనిపై ‘ట్వంటీ20’ పార్టీ సీనియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం నిజమైతే పెరుంబవూర్‌లో మరో అభ్యర్థిని నిలబెట్టాల్సి రావచ్చని తెలిపారు. ఇవాళ లక్ష్మీ ప్రియ స్థానంలో జీబీ వర్గీస్ పతిక్కల్ను ట్వంటీ20 పార్టీ పెరుంబవూర్ అభ్యర్థిగా ప్రకటించింది.లక్ష్మీప్రియ ప్రస్తుత నివాసం త్రిపుణితుర సమీపంలోని కారింగచిరలో ఉంది. ఆమె పేరు ఓటర్ల జాబితాలో నిజంగానే లేదని తెలిసింది. ఆమె గతంలో నివసించిన త్రిక్కాకరలో కూడా ఓటరు జాబితాలో ఆమె పేరు లేదు. దీనిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.లక్ష్మీ ప్రియ వివాదం మరవకముందే..లక్ష్మీ ప్రియ ఘటనను మరవకముందే అదే ట్వంటీ20 పార్టీలో అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఎట్టుమనూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నటి వీణా నాయర్‌ను ప్రకటించారు. అయితే, ఆమె పేరు కూడా ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని బయటపడింది. ఆమె స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీణా నాయర్ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తాను పోటీ చేయడం లేదని వీణా నాయర్ తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇద్దరు సినీ నటీమణులను అభ్యర్థులుగా ప్రకటించడం ఎన్డీఏకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, త్రిపుణితుర నియోజకవర్గంలో నటి అంజలిని ట్వంటీ20 పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అక్కడ ఆమె ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. -
విజయ్‌కు సీఎం పదవి, పార్టీకి 50 శాతం సీట్లు ఆఫర్ చేశారు
చెన్నై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్‌కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50 శాతం అసెంబ్లీ సీట్లను ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్లపాటు పంచుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారని, కానీ తమ అధ్యక్షుడు విజయ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని అర్జున వెల్లడించారు. ‘పదవి కోసం ఢిల్లీ పెద్దల ముందు తలవంచే వ్యక్తి విజయ్ కాదు. వారు మాకు 50 నుంచి 90 సీట్ల వరకు రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అయితే విజయ్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి కాదు, తమిళనాడు ప్రజల నమ్మకం మాత్రమే కావాలని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు. అయితే ఆఫర్ ఇచ్చిన పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని, రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో టీవీకే ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. పొత్తులపై ఇటీవల మీడియాతో మాట్లాడిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పొత్తుల కోసం తమ పార్టీ టీవీకేతో చర్చలు జరపలేదన్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేసిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలకు అధవ్ అర్జున క్షమాపణలు చెప్పారు. -
ఎన్నికల వేళ పొత్తులపై కుండబద్దలు కొట్టిన విజయ్
చెన్నై: పొత్తులపై టీవీకే చీఫ్, సినీనటుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తనను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు.తమిళనాడులోని మహాబలిపురంలో విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మేము ప్రజల టీమ్. కొందరు మమ్మల్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు... కానీ, అది పని చేయలేదు. మేము ఏదో ఒక కూటమిలో చేరతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎప్పుడూ లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెబుతున్నాను. దానిపై రాజీ పడము. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే నమ్మవద్దు. మన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం" అని అన్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.కాగా, దీనిపై ఇప్పటికే టీవీకే నేత ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. అలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్‌తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.


