టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున
చెన్నై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్‌కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50 శాతం అసెంబ్లీ సీట్లను ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్లపాటు పంచుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారని, కానీ తమ అధ్యక్షుడు విజయ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని అర్జున వెల్లడించారు. ‘పదవి కోసం ఢిల్లీ పెద్దల ముందు తలవంచే వ్యక్తి విజయ్ కాదు. వారు మాకు 50 నుంచి 90 సీట్ల వరకు రకరకాల ఆఫర్లు ఇచ్చారు.
అయితే విజయ్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి కాదు, తమిళనాడు ప్రజల నమ్మకం మాత్రమే కావాలని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు. అయితే ఆఫర్ ఇచ్చిన పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని, రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో టీవీకే ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.
పొత్తులపై ఇటీవల మీడియాతో మాట్లాడిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పొత్తుల కోసం తమ పార్టీ టీవీకేతో చర్చలు జరపలేదన్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేసిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలకు అధవ్ అర్జున క్షమాపణలు చెప్పారు.


