శాసన మండలికి ఊర్మిళ?

Actor Urmila Matondkar Joins In Shiv Sena Party - Sakshi

ఉద్ధవ్‌ ఠాక్రే సమక్షంలో శివసేనలో చేరిక

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నటి, రంగీలా భామ ఊర్మిళ మాటోండ్కర్‌ (46) మంగళవారం శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై ముంబై నార్త్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తరువాత ఊర్మిళ పార్టీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ముంబై యూనిట్‌ పనితీరు నచ్చక పార్టీని వీడినట్లు ఊర్మిళ సన్నిహితులు గతంలోనే తెలిపారు. పార్టీలో ఊర్మిళకు ఏమాత్రం సరైన ప్రాధాన్యత కల్పించని కారణంగా కాంగ్రెస్‌లో చేరిన ఐదు నెలల్లోనే హస్తం గూటిని వీడాల్సి వచ్చింది. పార్టీని వీడిన విషయంపై తాజాగా స్పందిస్తూ.. తాను వీడింది కేవలం కాంగ్రెస్‌ పార్టీనే తప్ప ప్రజా సేవను కాదని చెప్పారు.  

కంగనాపై ఫైర్‌...
ఊర్మిళను శాసనమండలికి పంపాలని శివసేన భావిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల గవర్నర్‌ కోటా నుంచి శాసనమండలికి నియమించాల్సిన 12మంది సభ్యుల పేర్ల జాబితాను, మహావికాస్‌ అఘాడి ప్రభుత్వం గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారికి సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. ఈ విషయంపై ఊర్మిళ స్పందిస్తూ.. తాను చట్టసభకు ఎంపికైతే మహిళల సమస్యలపై పోరాడతానని చెప్పారు. ఉద్ధవ్‌ నేతృత్వంలోని శివసేన చేస్తున్న ప్రజా సేవను గుర్తించి పార్టీలో చేరుతున్నట్లు తెలిపింది.

ముంబై నుంచి బాలీవుడ్‌ తరలిపోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ముంబై ఫిల్మ్‌ సిటీ వేలాది మంది కార్మీకుల కష్టం మీద నిర్మితమైందని అన్నారు. బాలీవుడ్‌ను రక్షించుకోవడం కోసం అందరూ ఏకం కావాలని అన్నారు. ఇటీవల ముంబైని పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) తో పోల్చినందుకు సంచలన నటి కంగనా రనౌత్‌ను ఊర్మిళ విమర్శించారు. కంగనాకు లేనిపోని ప్రాముఖ్యత కల్పించారని విమర్శించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top