ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ .. ప్రశ్నార్థకంగా మారిన శివసేన పార్టీ మనుగడ  

45 Shiva Sena Corporators in Kalyan Dombivli Pledge Support To Shinde - Sakshi

ముంబై: అనూహ్యంగా తగులుతున్న ఎదురుదెబ్బలతో విలవిలలాడుతున్న శివసేన పార్టీకి కళ్యాణ్‌ డోంబివిలిలో మరో బలమైన ఎదురుదెబ్బ తగిలింది. థాణే, నవీముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ల అనంతరం తాజాగా కళ్యాణ్‌ డోంబివిలి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో శివసేన పదాధికారులతో పాటు 40 మంది కార్పొరేటర్‌లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నివాసస్థానమైన నందనవనానికి వెళ్ళి తమ మద్దతు ప్రకటించారు. ఈ అనూహ్య సంఘటనతో శివసేన పార్టీ దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. త్వరలోనే కళ్యాణ్‌ డోంబివిలిలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ అనూహ్య ఘటన శివసేన మనుగడపై పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
చదవండి: వచ్చే వారంలో మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

మరింతమంది వస్తారు: శ్రీకాంత్‌ శిందే 
కళ్యాణ్‌ డోంబివిలి కార్పోరేషన్‌లో శివసేనకు 53 మంది కార్పొరేటర్‌లు ఉన్నారు. శివసేన అధికారంలోకి రావడానికి 4 నలుగురు స్వతంత్య్ర కార్పొరేటర్‌లు సహకరించారు. ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులను కలుపుకొని శివసేన కార్పొరేటర్‌ల సంఖ్య 59కి చేరింది. ఇందులో నుండి 40 మంది కార్పొరేటర్‌లు పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేను వదిలి ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో చేరిపోవడంతో శివసేన పార్టీకి కోలుకోని దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. తిరుగుబాటు చేసిన కార్పొరేటర్‌లలో రాజేశ్‌ మోరే, దీపేశ్‌ మాత్రే, రమేశ్‌ మాత్రే, విశాల్‌ పావ్‌శే, రవి పాటిల్, నితిన్‌ పాటిల్, రంజనా పాటిల్, చాయా వాఘ్మారే, నీలేశ్‌ శిందే, జనార్దన్‌ మాత్రే తదితరులున్నారు.

ఈ 40 మంది కార్పోరేటర్‌లు శిందే వర్గానికి మారడం వెనక లోక్‌సభ సభ్యుడు, ముఖ్యమంత్రి కుమారుడు శ్రీకాంత్‌ శిందే హస్తం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ శిందే మాట్లాడుతూ, క్రమక్రమంగా శివసేనకు చెందిన నాయకులెందరో శిందే వర్గంలో చేరుతారని అన్నారు. అయితే, తొలుత ఈ 40 మంది తిరుగుబాటు సమాచారం బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయమై  ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మాట్లాడుతూ, మహారాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామనీ, ఈ అభివద్ధి రథం ప్రగతిపథంలో నిరాటంకంగా పరుగెత్తాలంటే ప్రతి ఒక్కరు సహకరించాలనీ అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top