స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌  | 42 percent reservation for BCs in local bodies | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ 

Nov 11 2023 3:31 AM | Updated on Nov 11 2023 3:31 AM

42 percent reservation for BCs in local bodies - Sakshi

సాక్షి, కామారెడ్డి:  కులగణన, బీసీ కమిషన్‌ నివేదికల ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇ చ్చింది. ఈ రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 23శాతం నుంచి 42శాతానికి పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపింది. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సభలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ‘బీసీ డిక్లరేషన్‌’ను ప్రకటించగా.. ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అందులోని అంశాలను వివరించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. 

♦ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట బీసీ సబ్‌ప్లాన్‌కు అసెంబ్లీ తొలిసెషన్‌లోనే చట్టబద్ధత కల్పిస్తాం. బీసీ సంక్షేమానికి ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తాం. 
♦ ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధి కోసం కార్పొరేషన్లు. బీసీ యువత ఉన్నత చదువుల కోసం, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు. 
♦  అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో ఓ కన్వెన్షన్‌ హాల్, ప్రెస్‌ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్‌లతో కూడిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బీసీ ఐక్యతా భవనాల నిర్మాణం. బీసీ ఐక్యతా భవన్‌లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు. 
♦  ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం. ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కాలేజీ. రూ.3 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 
♦  వృత్తి బజార్‌ పేరుతో ప్రతి మండలంలో 50దుకాణాల షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం. అందులో మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతివృత్తుల వారికి ఉచితంగా షాపులు పెట్టుకునే స్థలం.
♦ గీత కార్మికులు, చేనేతలకు ఉన్నట్టుగా 50ఏళ్ల వృద్ధాప్య పింఛన్‌ వయోపరిమితి అన్ని చేతివృత్తుల వారికి వర్తింపు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థిక సాయం. 

కులాల వారీగా ప్రత్యేక పథకాలు, హామీలు 
♦  జీవో నం.19/02/2009ను పునరుద్ధరించి.. ముదిరాజ్, ముత్రాసు, తెనుగోళ్లు తదితర కులా లను బీసీ డీ నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చడం. 
♦  గంగపుత్రులకు సంబంధించి మత్స్యకార హక్కులకు.. ఇతర మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం. ఇందుకోసం తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఆక్వాకల్చర్‌కు ప్రోత్సాహం. క్యాప్టివ్‌ సీడ్, నర్సరీలు, మార్కెటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి ఏర్పాట్లు. 
♦  గొల్లకురుమలకు అధికారంలోకి వ చ్చిన వంద రోజుల్లో రెండో దశ గొర్రెల పంపిణీ. 
♦  గౌడ్‌ కులస్తులకు ఈతచెట్ల పెంపకం కోసం ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమి. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణాలపై 90శాతం సబ్సిడీ. మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ్‌లకు ప్రస్తుతమున్న రిజర్వేషన్‌ 15శాతం నుంచి 25శాతానికి పెంపు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్‌ జనగాం జిల్లాగా పేరు మార్పు. 
♦ మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు. 
♦ పద్మశాలీలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్‌లూం క్లస్టర్ల ఏర్పాటు. పవర్‌లూమ్స్, పరికరాలపై 90 శాతం సబ్సిడీ. 
♦ విశ్వకర్మలకు 90శాతం సబ్సిడీతో టూల్‌కిట్లు. పట్టణ ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుకు భూమి కేటాయింపు. 
♦ రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్‌ ఏర్పాటు కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం. రాష్ట్రవ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు కేటాయింపు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement