పెద్దపల్లిరూరల్: దూరం నుంచి రైలు వస్తుండగా పట్టాలపై నుంచి దాటేందుకు ప్రయత్నించడం ప్రాణాలకే ప్రమాదకరం. రైల్వేలెవల్ క్రాసింగ్‌ల వద్ద గేటు మూసిన సమయంలో పాదచారులు, ద్విచక్రవాహనదారులు కళ్లు మూసి తెరిచే లోగా అవతలి వైపు వెళ్లొచ్చనే ఆలోచనతో పట్టాలు దాటేందుకు యత్నిస్తున్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని అవగాహన కల్పించినా మార్పు కానరావడం లేదు.
ఆధునిక సాంకేతికత.. పెరిగిన రైళ్ల వేగం
రైల్వేలో ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. రైళ్ల వేగమూ పెరిగింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం వందేభారత్ లాంటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అత్యంత వేగంతో దూసుకెళ్తున్నాయి. దూరం నుంచి రైలు వస్తున్నప్పుడు దాని వేగం ఎంత?.. ఎంత సమయంలో మన దగ్గరకు చేరుతుందో అంచనా వేయలేని పరిస్థితులున్నాయి. పట్టాలను దాటేందుకు యత్నించే సమయంలో అంచనా తప్పిదంటే అనంతలోకాలకు పయనం కావాల్సిందే. నిమిషాల సమయం ఆదా చేసే ఆలోచనతో నిండు ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని రైల్వే భద్రతా అధికారులు హెచ్చరిస్తున్నారు.
పది నిమిషాలకో రైలు
ఖాజీపేట–బల్హార్ష మధ్య రైలు మార్గం ప్రధానమైంది. పెద్దపల్లి మీదుగా ప్రతీ పదినిమిషాలకో రైలు ప్రయాణిస్తుంటుంది. ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లతోపాటు గూడ్స్‌రైళ్ల రాకపోకలూ ఉంటాయి. దీంతో లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు మూసి ఉంచుతారు. అయితే రైలు రావడం లేదు కదా? అని గేటు కింది నుంచి బైక్‌తో సహా దూరి అవతలి వైపు చేరడం నిత్యకృత్యమైంది.
పట్టాలు దాటడం నేరం
రైల్వే శాఖ నిబంధనలు, చట్టాల ప్రకారం పట్టాలు దాటడం నేరం. గతంలో రైల్వే అధికారులు భద్రతావారోత్సవాల పేరిట ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆ సమయంలో పట్టాలు దాటుతున్న వారిని గుర్తించి రైల్వే రక్షకదళం (ఆర్‌పిఎఫ్) అధికారులు కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. అయినా ప్రజలు ఇష్టానుసారంగా పట్టాలు దాటేస్తున్నారు.
జాగ్రత్తలు ఇలా పాటించండి
పట్టాలెక్కితే ప్రమాదమే..!


