● తుపాను ప్రభావం ● అన్నదాతల్లో ఆందోళన
మంథని: తుపాను ప్రభావంతో జిల్లాలో అక్కడక్కడా మేఘాలు కమ్ముకోవడం, వర్షాలు కురిసే సూచనలు కనిపించడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ఏ రూపంలో విరుచుకుపడుతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏటా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమోనన్న భయం వెంటాడుతోంది.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం
జిల్లావ్యాప్తంగా పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన అన్నదాతలు.. తూకం కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆలస్యంగా కొనుగోళ్లు ప్రా రంభం కావడంతో చాలాచోట్ల రాశులు పేరుకు పోయాయి. వాతావరణంలో మార్పులు, తుపాను ప్రభావంతో వర్ష సూచనలు ఉండడంతో ధాన్యం తడుస్తుందా? అనే ఆందోళన వ్యక్తవుతోంది.
మార్కెట్‌లో ఏటా నష్టాలు..
మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం చిన్నపాటి వర్షానికే వరద నీటిలో కొట్టుకుపోయి ఏటా రైతులు నష్టపోతున్నారు. ఈసారి కూడా పెద్దమొత్తంలోనే ధాన్యం దిగుబడి అవుతొంది. పంట అమ్ముకునే సమయంలో ప్రతీసారి అక్టోబర్, నవంబర్‌లో అకాల వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత నెలలలో తుపాన్ ప్రభావం ఆంధ్రా కే పరితమైనా మనజిల్లాలోనూ పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఈసారి అకాల వర్షాల ముప్పు తప్పి, పంటకు నష్టం వాటిల్లదనే ధీమాలో ఉన్నక్రమంలో శుక్రవారం మళ్లీ మబ్బులు కమ్ముకోవడంతో రైతుల్లో మళ్లీ కలవరం మొదలైంది.


