గోదావరిఖని: 2025– 26 ఆర్థిక సంవత్సరం ముగిసి దాదాపు ఆరు నెలలు గడిచినా లాభాలు, ఉద్యోగు ల వాటాపై సింగరేణి ఇంకా స్పష్టత ఇవ్వడంలేదు. గతేడాది సెప్టెంబర్ 22న లాభాలు ప్రకటిస్తూ కార్మికుల వాటా 34శాతం అని తేల్చింది.
2024 – 25లో రూ.6,394 కోట్ల లాభాలు..
గత ఆర్థిక సంవల్సరంలో సింగరేణి రూ.6,394 కో ట్ల నికర లాభం ఆర్జించింది. ఇందులో నుంచి కొత్త ప్రాజెక్టుల విస్తరణ కోసం రూ.4,034 కోట్లు కేటా యించి, మిగిలిన రూ.2,360 కోట్లపై 34 శాతం లెక్కన దాదాపు రూ.819.40కోట్లను కార్మికులు, ఉద్యోగులకు బోనస్‌గా ప్రకటించింది. దీంతో సు మారు 40వేల మంది రెగ్యులర్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,95లక్షల చొప్పున రూ.802.40కోట్లు అందగా, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 చొప్పు న రూ.17కోట్లు చెల్లించారు. అయితే మొత్తం నికర లాభంపై వాటా చెల్లించకుండా విస్తరణ వ్యయాలను మినహాయించి మిగిలిన మొత్తంపై లెక్కించడంతో కార్మికుల వాటా తగ్గుతోందని కొన్నికార్మిక సంఘాలు అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈసారి లాభాల సంగతి ఏమిటి?
గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఎంతలాభం సాధించింది? అందులో నుంచి ఎంతమొత్తాన్ని విస్తరణకు కేటాయించనుంది? కార్మికులకు ఎంత శాతం వాటా ఇవ్వనుంది? అనే ప్రశ్నలు కీలకంగా మారాయి. ఇప్పటికే కార్మిక సంఘాలు 40 శాతం లాభాల వాటా ఇ వ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. జూన్ 2026లో లాభాల వాటాతోపాటు ఇతర డిమాండ్లపై గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ సమ్మె నోటీసు కూడా ఇచ్చింది.
ముఖ్యమంత్రి ప్రకటించే ఆనవాయితీ..!
సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఈనెల 24న హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా.. ఎజెండాలో పొందుపర్చిన అంశాలను యాజమాన్యం ఇప్పటికీ వెల్లడించలేదు. తొలుత యాజమాన్యం లాభాలు ప్రకటించి, ఆ తర్వాత ప్రభుత్వం వద్దకు వెళ్తే.. ముఖ్యమంత్రి వాటా ప్రకటించడం ఆనవాయితీ. గతేడాది 34శాత వాటా చెల్లించిన నేపథ్యంలో ఈసారి 40శాతం కావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తో వేచిచూడాలి.
ఐదేళ్లలో లాభాలు, కార్మికుల వాటా(రూ. కోట్లలో)
ఏడాది లాభాలు వాటా చెల్లింపు తేదీ
2020–21 272.20 29% 79.06 11–10–2021
2021–22 1,227 30% 368.00 10–10–2022
2022–23 2,222 32% 711.00 22–10–2023
2023–24 2,388.50 33% 788.20 20–09–2024
2024–25 6,394 34% 819.40 22–09–2025
ప్రకటించని సింగరేణి యాజమాన్యం
గతేడాది సెప్టెంబరు 22న చెల్లింపులు
లాభాల వాటా కోసం కార్మికులు, ఉద్యోగుల ఎదురుచూపులు


