పెద్దపల్లి: పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏళ్లుగా నిరుపయోగంగా పడిఉంటున్నాయి. సుల్తానాబాద్‌లో 2017–18లో రూ.6 కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేసే క్రమంలో నిలిచిపోయాయి. ఇళ్లపై విద్యుత్ తీగలు ఉండడంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పాండవులగుట్ట సమీపంలో రూ.14 కోట్లతో 280 ఇళ్ల నిర్మాణాన్ని 2017–18లో ప్రారంభించారు. 2022 నాటికే పనులు పూర్తయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు ఇంకా అప్పగించలేదు.
వసతులు లేక.. పంపిణీ నిలిచి..
ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. అంతర్గత రోడ్లు, తాగునీరు, విద్యుత్, వీధిదీపాలు, మురుగునీటి కాలువలు వంటి వసతులు కల్పించలేదు. దీంతో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించినా నివాసం ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఖాళీగా ఉన్న భవనాలు క్రమంగా దెబ్బతింటుంటున్నాయి. అంతేకాదు.. రాత్రివేళ ఇళ్ల పరిసరాల్లో మందుబాబులు సంచరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా ఉండడంతో ప్రజాధనం వృథా అవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
సొంతిళ్ల కోసం నిరీక్షిస్తున్న పేదలు
సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్‌లో నిరుపయోగంగా పడిఉన్న వైనం
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో వసతులు కూడా కరువే..


