పెద్దపల్లిరూరల్: జిల్లా రవాణశాఖ కార్యాలయం ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇరుకుగదులతో అధికారులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంత భవనం నిర్మించేందుకు నిధులు ఉన్నా స్థలం కరువైంది. అనువైన స్థలం కేటాయించాలని ఆర్టీఏ కార్యాలయ అధికారులు నిత్యం రెవెన్యూ అధికారులకు విన్నవిస్తున్నా ఇప్పటి వరకు ఫలితం కనిపించడం లేదు.
30 ఏళ్లుగా అద్దె భవనమే దిక్కు
పెద్దపల్లిలో మోటార్‌వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం సుమారు 30 ఏళ్ల క్రితమే అద్దెభవనంలో ఏర్పాటైంది. అప్పట్నుంచి వాహనదారులకు సేవ లు అందిస్తున్న రవాణ శాఖ అధికారులు.. ఇరుకు గదుల్లో విధులు నిర్వర్తించడం కష్టంగా ఉన్నా త ప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016 అక్టోబర్ 11న పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవించింది. అప్పటివరకు ఎంవీఐ కార్యాలయంగా ఉన్న ఆఫీసు జిల్లా రవాణ శాఖ అధికారి కార్యాలయంగా మారింది. జిల్లా కార్యాలయం అందుబాటులోకి రావడంతో వాహనాల పనులన్నీ ఇక్కడి కార్యాలయంలోనే అందుబాటులోకి వచ్చాయి. దీంతో వాహనదారు లు కరీంనగర్ వరకు వెళ్లే బాధ తప్పింది. (ప్రస్తుతం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి) జి ల్లాలోని భారీ వాహనాలు మొదలు బైక్‌లు, ఆటో లు, ట్రాక్టర్లు ఇలా అన్నిరకాల వాహనాలకు ఇక్కడే రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
చెట్ల నీడే దిక్కు
వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ లాంటి పనుల కోసం వచ్చే వాహనదారులు పనులు పూర్తయ్యేవరకూ చెట్ల నీడనే ఆశ్రయించాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వాహనాలతో ఆవరణ నిండి ఉంటోంది. నిబంధనలను పాటించని వాహనాలను సీజ్ చేసిన అధికారులు.. వాటిని భద్రపర్చేందుకు కూడా స్థలం కరువైంది. కొన్ని వాహనాలను ఫైర్‌స్టేషన్ ప్రాంతంలో నిలుపుతున్నారు.
పెరిగిన ఉద్యోగుల సంఖ్య
ఎంవీఐ కార్యాలయం నుంచి జిల్లా రవాణా శాఖాధికారి ఆఫీసుగా హోదా పెరగడంతో అందు కు తగ్గట్టుగా అధికారులు, సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. వారంతా ఇప్పుడు ఇరుకైన అద్దె గదుల్లో అవస్థలు పడుతూ పనులు చేయాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతమున్న గదులు సరిపోక తాత్కాలికంగా షెడ్లు నిర్మించారు.
స్థలం కేటాయిస్తేనే..
జిల్లా రవాణశాఖ అధికారి కార్యాలయానికి అవసరమైనంత స్థలాన్ని కేటాయిస్తేనే ఇబ్బందులు దూరమయ్యే అవకాశాలున్నాయి. కార్యాలయ భవనాలు, డ్రైవింగ్ టెస్టు కోసం స్థలం కూడా అవసరముంటుంది. విశాలమైన స్థలం అవసరం కావడంతో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోనే స్థలం అందుబాటులో ఉందని, అయితే ఆ స్థలం గుట్టకు సమీపంలో ఉండడంతో ఏర్పాటుకు విముఖత చూపి మరోప్రాంతంలో స్థలాన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీఏ ఆఫీసుకు అవసరమైన, అనువైన స్థలాన్ని కేటాయించాల్సిన అవసరముందని వాహనదారులు విన్నవిస్తున్నారు.
అద్దె భవనంలో తప్పని అవస్థలు
సందర్శకులకు చెట్ల నీడే దిక్కు
పక్కా భవన నిర్మాణానికి స్థలం కరువు
జిల్లా రవాణా శాఖ కార్యాలయం తీరు


