ప్రభుత్వ షట్టర్లు.. చౌకగా అద్దెకు.. సర్కార్ ఆదాయానికి గండి కిరాయి పెంపునకు అంగీకరించకుంటే బహిరంగ వేలం యాజమాన్యాలకు నోటీసులు
పెద్దపల్లి: సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రి పరిధిలోని షట్టర్ల కిరాయిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏళ్లుగా నామమాత్రపు కిరాయిలతో కొనసాగుతున్న షట్టర్లకు ప్రభుత్వం నిర్ణయించిన కొత్త అద్దెకు అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించని పక్షంలో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుసరించిన విధంగా బహిరంగ వేలం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆస్పత్రి పరిధిలో మొత్తం 21 షట్టర్లు ఉండగా ప్రస్తుతం ఒక్కో దానికి నెలకు రూ.4,677 మాత్రమే కిరాయి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, స్థానిక బహిరంగ మార్కెట్‌లో ఒక్క షట్టర్‌కు నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు అద్దె ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ అద్దెకు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వం గణనీయమైన ఆదాయం కోల్పోతున్న పరిస్థితి నెలకొంది.
21 షట్టర్లకు నోటీసులు
ఈ నెల 1న సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రి పరిధిలోని 21 షట్టర్ల వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన కిరాయి ప్రకారం కొనసాగేందుకు వ్యాపారులు అంగీకరించాలి. లేకుంటే బహిరంగ వేలం ద్వారా కొత్తగా కిరాయికి ఇచ్చే ప్రక్రియ చేపట్టనున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.
మార్కెట్ కిరాయి రూ.12 వేలు
బహిరంగ మార్కెట్‌లో ఒక్క షట్టర్‌కు నెలకు రూ.10 వేలకుపైగా, కొన్ని ప్రాంతాల్లో రూ.12 వేల వరకు కిరాయి పలుకుతున్నట్లు సమాచారం. 21 షట్టర్లను మార్కెట్ ధరలకు అనుగుణంగా కిరాయికి ఇస్తే ప్రభుత్వానికి ప్రస్తుతం వస్తున్న మొత్తంతో పోలిస్తే గణనీయంగా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
పలు పార్టీల నాయకులే బినామీలు
అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్, పలు వ్యాపార సంస్థ యజమానులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలో షట్టర్లను ఇప్పించుకున్నారు. అన్ని వర్గాలవారు ఉండడంతో రేట్లు పెంచేందుకు సుముఖంగా లేకపోవడంతో కలెక్టర్ వీటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కలెక్టర్‌పై షట్టర్ యజమాన్యం ఒత్తిడి తెచ్చినా వెనుకడుగు వేయడం లేదు.
షట్టర్ల అమ్మకాలపై కలెక్టర్ సీరియస్
సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని షట్టర్ల అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో షట్టర్‌ను రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం ఓపెన్ టెండర్ ద్వారా షట్టర్లను కేటాయించాలని నిర్ణయించడంతో, గతంలో కొనుగోలు చేసిన వారు విక్రయించినవారిని సంప్రదిస్తున్నా.. తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు ఇప్పటికే సంబంధిత షట్టర్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు పలువురు నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో కలెక్టర్ ఈ అంశంపై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. నోటీసులకు స్పందించకుండా ముందుకు రాకుంటే షట్టర్లను సీజ్ చేసి, అనంతరం నిర్వహించే ఓపెన్ టెండర్‌లో కై వసం చేసుకున్న వారికి అప్పగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో షట్టర్ల వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని వ్యాపారవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఆదాయానికి గండి ఎంత?
ప్రస్తుతం ఒక్కో షట్టర్‌కు సుమారు రూ.4,677 చొప్పున 21 షట్టర్ల నుంచి నెలకు రూ.98 వేలకుపైగా ఆదాయం వస్తుంది. అదే రూ.12 వేల చొప్పున మార్కెట్ కిరాయిగా లభిస్తే నెలకు రూ.2.52 లక్షలు వస్తాయి. అంటే సుమారు రూ.1.54 లక్షల మేర నెలకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఏడాది లెక్కన ఈ తేడా రూ.18.5 లక్షలకు పైగా ఉంటుంది. దీంతో ప్రభుత్వాసుపత్రి షట్టర్ల కిరాయిలను మార్కెట్ ధరలకు అనుగుణంగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోటీసులు జారీ చేశాం
కలెక్టర్ ఆదేశాల మేరకు షటర్ యాజమాన్యాలకు నోటీసులు అందజేశాం. బహిరంగ మార్కెట్‌కు షటర్ల కిరాయికి భారీగా తేడా ఉంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆలోచనతో కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
– డాక్టర్ రమాదేవి,
ఆస్పత్రి సూపరింటెండెంట్, సుల్తానాబాద్


