అక్షితరాణి కుటుంబానికి అండగా ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

అక్షితరాణి కుటుంబానికి అండగా ప్రభుత్వం

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

పెద్దపల్లి/సుల్తానాబాద్‌రూరల్‌: హత్యకు గురైన తాండ్ర అక్షితరాణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. గురువారం ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ ఝా, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌రాజ్‌ ఠాకూర్‌తో కలిసి సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంటలో అక్షితరాణి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.4.12 లక్షల పరిహారం అందజేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో రూ.4.12 లక్షలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇంటి నిర్మాణ బాధ్యత నాదే

హత్యకు గురైన అక్షితరాణి కుటుంబానికి మంజూరయ్యే ఇందిరమ్మ ఇంటిని పూర్తి చేయించే బాధ్యత తనదేనని విప్‌ విజయరమణారావు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎలాంటి ఆర్థికభారం లేకుండా ఇంటిని పూర్తి చేయిస్తానన్నారు. కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్‌ లేదా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్షితరాణి హత్య నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు.

వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

రాష్ట్రంలో మహిళలపై వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ అన్నారు. అక్షితరాణి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్‌ బషీరోద్దీన్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ చైర్మన్లు మినుపాల ప్రకాష్‌రావు, ఆకుల నర్సయ్య, విండో చైర్మన్లు భాస్కర్‌రెడ్డి, చిలుక సతీశ్‌, కల్లేపల్లి జాని, పడాల అజయ్‌గౌడ్‌, సారయ్యగౌడ్‌, డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, సీఐ రంజిత్‌రావు, ఎస్సై చంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement