గోదావరిఖని: జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న గనులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఏటా ఇచ్చే స్టార్ రేటింగ్ అవార్డుల్లో సింగరేణి ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–వన్ వరుసగా మూడోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించి హాట్రిక్ నెలకొల్పింది. షీల్డ్, ప్రశంసా పత్రాలను శనివారం గని ఆపరేషన్ సైట్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రదర్శించారు. ఇందుకు కారణమైన కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్కులు కేటాయించగా, అందులో నెగ్గింది. కేంద్ర బొగ్గు శాఖ పరిశీలక బృందం ప్రత్యక్షంగా పరిశీలించి మూల్యాంకనం జరుపుతుంది. ఇందులో 100 మార్కులకు 91కి పైగా మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈప్రతిష్టాత్మక అవార్డును ఈనెల 2న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నుంచి ఆర్జీ–3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ సీఎండీ సమక్షంలో అందుకున్నారు. 50ఏళ్లు పూర్తి చేసుకున్న సింగరేణి సంస్థలోని అత్యుత్తమ ఓపెన్ కాస్ట్ గనిగా అన్ని రంగాల్లో ముందు ఉండటం ఉద్యోగుల కృషి, నైపుణ్యానికి నిదర్శనమని జీఎం అన్నారు. ఇదే స్ఫూర్తితో కార్మికులు, అధికారులు ముందుకు సాగి మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ వి.ఫాటింగ్, మేనేజర్ రావుల పాపయ్య, ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతియాదవ్, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఎంఆర్‌సీ రెడ్డి, అధికారుల సంఘం ప్రతినిధి, సెక్యూరిటీ అధికారి కోల శ్రీనివాస్‌గౌడ్, అధికారులు మురళీకృష్ణ, జ్ఞాన సంబంధన్, అజయ్‌కుమార్, రవీందర్ పాల్గొన్నారు.


