నేడు రామగుండం బల్దియాలో సాధారణ సమావేశం
26 అంశాలతో ఎజెండా సిద్ధం
అధికారులను నిలదీసేందుకు సిద్ధమవుతున్న కార్పొరేటర్లు
ఎల్‌ఈడీ నిర్వహణ, తాగునీటి చార్జీలు, స్మార్ట్ ఫోన్లు, అభివృద్ధి పనులపై చర్చకు అవకాశం
కోల్‌సిటీ: 6 నెలల విరామం తర్వాత రామగుండం నగరపాలక సంస్థ సాధారణ సమావేశం శుక్రవారం జరగనుంది. 26 అంశాలతో రూపొందించిన ఎజెండాను ఇప్పటికే మేయర్‌తోపాటు 59 మంది కార్పొరేటర్లకు అధికారులు పంపిణీ చేశారు. నగరంలో నెలకొన్న సమస్యలు, అధికారుల పనితీరు, కార్పొరేటర్లు, అధికారులకు మధ్య పెరిగిన సమన్వయ లోపం, వివిధ ప్రతిపాదనలపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల పలువురు కార్పొరేటర్లు అధికారుల తీరుపై బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ సైతం కమిషనర్ చాంబర్‌లో బైఠాయించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. పలు డివిజన్లకు చెందిన ప్రజాప్రతినిధులు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారులపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
ఎజెండాలో ముఖ్యాంశాలు
● 15వ ఆర్థిక సంఘం టైడ్ నిధులు, వాటర్ సప్లయ్ నిధులతో రూ.20లక్షల వ్యయంతో నీటి సరఫరా లీకేజీల నివారణ, బోర్‌వెల్ పరికరాల కొనుగోలుకు ప్రతిపాదన.
● వన మహోత్సవ కార్యక్రమానికి 15వ ఆర్థిక సంఘం అన్‌టైడ్, గ్రీన్ బడ్జెట్ నిధులు వినియోగించే అంశం.
● నగరంలో సుమారు 25వేల ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, 7 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యతలను పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించే ప్రతిపాదన. ఒక్కో ఎల్‌ఈడీకి నెలకు రూ.147 చొప్పున చెల్లించేలా సుమారు రూ.40లక్షల వ్యయానికి ప్రతిపాదించారు.
● గతంలో ఎల్‌ఈడీ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంస్థ సిబ్బంది సకాలంలో మరమ్మతుకు రాకపోవడంతో స్థానిక సిబ్బందే పనులు చేయాల్సి వచ్చిందని పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరే అవకాశముంది.
● కార్పొరేటర్లకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డుల కోసం రూ.30లక్షల ప్రతిపాదన.
● సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా వివిధ డివిజన్లలో అద్దె ప్రాతిపదికన ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు రూ.22లక్షలు.
● అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద వివిధ అభివృద్ధి పనులకు సమగ్ర డీపీఆర్ రూపొందించేందుకు కన్సల్టెంట్‌ను నియమించి నిధులు మంజూరు చేసే అంశం.
● 7.50 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కౌన్సిల్ తీర్మానం.
● వివిధ ప్రాంతాల్లో కొత్త బోర్‌వెల్‌ల ఏర్పాటుకు రూ.20లక్షలు.
● నగరపాలక సంస్థ కార్యాలయ ఆధునికీకరణకు రూ.20లక్షలు.
● పలు డివిజన్లలో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.60లక్షలు.
● ఇంటింటి నల్లా కనెక్షన్ రుసుమును నెలకు రూ.100 నుంచి రూ.150కి పెంచే ప్రతిపాదన.
● ఇంటింటి చెత్త సేకరణకు పెంచిన చార్జీలను అమలు చేసేందుకు రుసుములు నిర్ణయించే అంశం.
● వివిధ ప్రాంతాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుకు రూ.40లక్షల నిధుల వినియోగం.
అధికారులను నిలదీస్తారా?
ఇటీవల అధికారుల వ్యవహార శైలిపై కార్పొరేటర్లలో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశముంది. అధికారుల వివరణలకు సభ్యులు సంతృప్తి చెందుతారా? ఇటీవల ఇద్దరు కార్పొరేటర్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన అంశం ప్రస్తావనకు వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఎజెండాలోని అంశాలపై పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
హాజరుకానున్న ఎమ్మెల్యే
సమావేశానికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హాజరు కానున్నట్లు తెలిసింది. కార్పొరేటర్లు సమస్యలను ప్రస్తావిస్తారా? ఎజెండా అంశాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తారా? లేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి సమావేశాన్ని ముగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.


