పెద్దపల్లిరూరల్: న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువర్గాలకు చెందిన వారు రాజీతో పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి కుంచాల సునీత సూచించారు. జిల్లా కోర్డు ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భవానితో పాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్‌తో కలిసి ఆమె మాట్లాడారు.
పెద్దపల్లికి నాలుగు సబ్‌స్టేషన్లు
పెద్దపల్లి: నియోజకవర్గంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మరో నాలుగు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రూ.13.51 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలతో రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లిలో రూ.2.44 కోట్లతో.. సుల్తానాబాద్‌లోని శాస్త్రినగర్‌లో రూ.2.47కోట్లతో.. ఓదెల మండలం రూప్‌నారాయణపేటలో రూ.4.14 కోట్లతో.. ఎలిగేడు మండలం ధూళికట్టలో రూ.4.44 కోట్లతో సబ్‌స్టేషన్లు నిర్మించనున్నట్లు వివరించారు. వచ్చే వేసవి నాటికి సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తెస్తామన్నారు.
అభివృద్ధే లక్ష్యంగా సమావేశం కొనసాగాలి
గోదావరిఖని: కార్పొరేషన్ అభివృద్ధే లక్ష్యంగా కౌన్సెల్ సమావేశం కొనసాగాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. రామగుండం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన, డివిజన్లలో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై కార్పొరేటర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఎండీ ముస్తఫా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఆధార్ సేవల్లో జాప్యం చేయొద్దు
పెద్దపల్లి: జిల్లాలో ఆధార్ సేవలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి.శ్రీరాములుతో కలిసి జిల్లా స్థాయి ఆధార్ మానిటర్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన ఆధార్ నమోదులు, మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్లు, పెండింగ్ దరఖాస్తులు, శాఖల సమన్వయంపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న నూతన నమోదులు, బయోమెట్రిక్ అప్‌డేట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ, పోస్టల్ శాఖలు సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సక్రమంగా డేటా సేకరించని కేంద్రాలు, నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసిస్టెంట్ మేనేజర్ రత్నాకర్, ఈడీఎం కవిత తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై ఏఐ నిఘా
పెద్దపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ స్మార్ట్ అసెస్‌మెంట్ పోర్టల్‌ను పకడ్బందీగా వినియోగించాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. పోర్టల్‌లో 16 ప్రశ్నలకు సమాధానాలతోపాటు సంబంధిత ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఫొటోలను ఏఐ విశ్లేషించి అవి సరైనవో కాదో గ్రేడింగ్ ఇస్తుందన్నారు. రవాణా వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ఏర్పాటు చేసి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


