కాకతీయుల కళావైభవం..
రాయికల్: కాకతీయుల కళావైభవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది రాయికల్ పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయం. ఇక్కడ దేశంలోనే రెండో పంచముఖ లింగం కొలువై ఉంది. ఎంతోచరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశీలో మాత్రమే ఉన్న పంచముఖ లింగం ఈ ఆలయంలోనూ ఉంది. ఇక్కడి శిలాశాసనాలు, అవశేషాలు, దేవనాగరి లిపితో లభించిన శాసనాలతో రావికంటి (నేడు రాయికల్) చరిత్ర వెలుగుచూసింది. ప్రభాకర్‌రావుపేట, గోవిందురాజుపేట, ఒద్దులాపురం, పద్మపురం, నందిపేట, రాయికంటి (రాయికల్), కొండాపూర్ గ్రామాలు కలిపి రావికంటిగా ఏర్పడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.
ఇది ఆలయ చరిత్ర
జైన మతం అభిమానులైన వేములవాడ చాళుక్యులు 700 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన లకుమాదేవి బిడ్డకు పాలు ఇస్తుండగా.. ఆమె మామ ఇంట్లోకి రావడాన్ని గ్రహించలేదని, లేవకుండా కనీసం గౌరవం ఇవ్వలేదని ఆమె మామ ఆగ్రహించాడని, ఆ అవమానాన్ని తట్టుకోలేని లకుమాదేవి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి చెరువు, ఆలయం నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. నేటికీ లకుమాదేవి చెరువు కింద 1500 ఎకరాల భూమి సాగులో ఉండడం గమనార్హం. ఆలయంలో నమస్కరిస్తున్న భంగిమలో చెక్కిన ఓ సీ్త్రమూర్తి విగ్రహం ఉండడంతో అది లకుమాదేవిదే అయి ఉండవచ్చునని భావిస్తున్నారు.
అభివృద్ధికి ఆమడ దూరం
చెన్నకేశవనాథ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నా.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రెండేళ్ల నుంచి ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతోంది. వర్షం కురిస్తే ఉత్సవవిగ్రహాలపై నీరు పడుతోందని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పాములు, తేళ్లు సంచరిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు.
27న పర్యాటక దినోత్సవం
ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ చొరవతో చెన్నకేశవనాథ ఆలయంలో వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని మండలాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఆలయ విశిష్ఠతను వివరించడంతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
దేశంలోనే రెండో పంచముఖ లింగం
అపురూప ఆలయానికి ఆదరణ కరువు
ఈనెల 27న ఆలయంలో పర్యాటక దినోత్సవం


