కోల్‌సిటీ(రామగుండం): వైద్యుడు రోగాన్ని గుర్తిస్తే.. ఫార్మసిస్ట్ ఆ రోగికి అందే ఔషధం ఇస్తూనే .. ఏమంది.. ఎంత మోతాదులో వేసుకోవాలో అవగాహన కల్పిస్తారు. తెరవెనుక సేవలందించే ఫార్మసిస్టులను గుర్తుచేసుకునేందుకు ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 25న ‘ప్రపంచ ఫార్మాసిస్టుల దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నినాదం ‘ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం ఫార్మసిస్ట్‌లను సాధికారత చేయడం’.
ఔషధం.. సాధారణ వస్తువు కాదు
ఔషధం సాధారణ వస్తువు కాదు. సరైన మందు సరైన వ్యక్తికి, సరైన మోతాదులో, సరైన విధంగా అందితేనే ఆశించిన ప్రయోజనం కలుగుతుంది. ఔషధాల నిల్వ, నాణ్యత, గడువు తేదీలు, మోతాదు, వినియోగం వంటి అంశాల్లో ఫార్మసిస్టుల అప్రమత్తత అవసరం.
నాణ్యతపై రాజీ వద్దు
కల్తీ, నకిలీ లేదా అనుమానాస్పద ఔషధాల నియంత్రణలోనూ ఫార్మసిస్టులు కీలక భాగస్వాములు. ఔషధాలను కొనుగోలు చేసేటప్పుడు తయారీదారు వివరాలు, సరఫరా సంస్థ, బిల్లులు, బ్యాచ్ నంబరు, తయారీ, గడువు తేదీలు వంటి అంశాలను పరిశీలించడం అవసరం. కేవలం అధిక డిస్కౌంట్ లేదా తక్కువ ధర ఆధారంగా ఔషధాలను ఎంపిక చేయకుండా వాటి నాణ్యత, చట్టబద్ధమైన సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మాత్రకు.. మాటకు మధ్య మారధి
చాలామంది రోగులు వైద్యుడి సూచనతో మందులు తీసుకున్నా.. వాటి వినియోగంపై సందేహాలు వచ్చినప్పుడు ముందుగా ఫార్మసిస్ట్‌ను సంప్రదిస్తుంటారు. మందు ఎలా భద్రపరచాలి? భోజనానికి ముందు తీసుకోవాలా.. తర్వాతా? మోతాదు మరిచిపోతే ఏం చేయాలి? వంటి సాధారణ సందేహాలకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం ద్వారా చికిత్సను సురక్షితంగా కొనసాగించేందుకు రోగులకు ఫార్మసిస్టులు వారిధిగా సహకరిస్తారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 4వేలకు పైగా రిటైల్ మెడికల్ షాపులు ఉన్నాయి. మొత్తం సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఫార్మాసిస్టులు సేవలందిస్తున్నారు.
నిరంతరం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు
ఉమ్మడి జిల్లాలో డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్లు మెడికల్‌షాపుల లైసెన్స్, రెన్యువల్స్ జారీ చేయడంతోపాటు దుకాణాల తనిఖీలు, మందుల నాణ్యతను పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన మందులను ల్యాబోరేటరికి పరిశీలనకు పంపిస్తున్నారు. నాణ్యతలో లోపం ఉంటే సంబంధిత విక్రయదారుడు, తయారీదారులపై చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
రోగి ఆరోగ్యానికి ఫార్మాసిస్టే భరోసా
మందుల ఎంపిక నుంచి వినియోగం వరకు కీలకపాత్ర
ఉమ్మడి జిల్లాలో 5 వేల మంది ఫార్మసిస్టులు
నేడు వరల్డ్ ఫార్మసిస్ట్ డే


