క్రేన్‌ ఢీకొని టెంట్‌హౌజ్‌ వ్యాపారి మృతి | - | Sakshi
Sakshi News home page

క్రేన్‌ ఢీకొని టెంట్‌హౌజ్‌ వ్యాపారి మృతి

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

గోదావరిఖని/రామగుండం: ఇంట్లో కరెంట్‌ పోవడంతో విద్యుత్‌ సరఫరా కోసం ఫిర్యాదు చేయడానికి ఆఫీస్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో టెంట్‌హౌజ్‌ వ్యాపారి మృతి చెందాడు. గురువారం స్థానిక మాతంగికాంప్లెక్స్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకతీయనగర్‌కు చెందిన బల్లం రాంచందర్‌(53)ను క్రేన్‌ ఢీకొనడంతో మృతి చెందాడు. కడుపుపై నుంచి క్రేన్‌టైర్లు వెళ్లడంతో పేగులు బయటకు వచ్చి తీవ్రగాయాల పాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాంచందర్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. క్రేన్‌ వాహనం డ్రైవర్‌ వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వెనుక నుంచి రాంచందర్‌ను ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం డ్రైవర్‌ కానుగంటి రమేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.

గూడ్స్‌ రైలు ఢీకొని..

అంతర్గాం మండల పరిధిలోని బద్రిపల్లికి చెందిన నాంసాని లక్ష్మి(52) బుధవారం రాత్రి గూడ్సు రైలు కింది నుంచి దాటుతుండగా రైలు కదలడంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బద్రిపల్లికి మధ్యలో నుంచి గోదావరిఖని, ఎన్టీపీసీ పరిశ్రమలకు వెళ్లే రైల్వే లైన్‌ ఉంది. లక్ష్మి గూడ్సు రైలు కింద నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఆమె చీర వ్యాగన్‌ కింద ఇనుప కొంకెకు తట్టుకొని లాగడంతో రైలు పట్టాలపై పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఆమె మృతదేహాన్ని గూడ్సు రైలు రామగుండం రైల్వేస్టేషన్‌ వరకు ఈడ్చుకెళ్లింది. మృతురాలికి భర్త అంజయ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై సంధ్యారాణి పేర్కొన్నారు.

ఇద్దరి కళ్లతో నలుగురికి చూపు

ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలు నేత్రదానానికి ముందుకొచ్చాయి. నలుగురికి చూపునిచ్చి ఆదర్శంగా నిలిచాయి. గోదావరిఖని కాకతీయనగర్‌కు చెందిన టెంట్‌హౌస్‌ నిర్వాహకుడు బొల్లం రామచందర్‌ (58) గురువారం స్థానిక మాతంగి కాంప్లెక్స్‌ ఎదుట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా క్రేన్‌ వాహనం ఢీకొనగా అక్కడిక్కడే మృతిచెందాడు. అంతర్గాం మండలం బద్రిపల్లికి చెందిన ఎన్‌.లక్ష్మి(55) గూడ్స్‌ రైలు ఢీకొనడంతో మృతిచెందింది. ఈ విషాద సమయంలోనూ రెండు కుటుంబాలు నేత్రదానానికి ముందుకు వచ్చాయి. సదాశయ ఫౌండేషన్‌, మేదరి సంఘం ప్రతినిధుల సూచన మేరకు జీజీహెచ్‌లో ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌ టెక్నిషియన్‌ ప్రదీప్‌ నాయక్‌ నేత్రాలు సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. రెండు కుటుంబాల నిర్ణయం పలువురికి ఆదర్శమని సదాశయ ఫౌండేషన్‌ గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, ప్రచార కార్యదర్శి వాసు, ప్రతినిధులు చంద్రమౌళి, భీష్మాచారి, కవిత అనంతరాములు, రాజమౌళి, లక్ష్మీనారాయణ, రాములు, అన్నపూర్ణ, శశికళ, జ్యోతి తదితరులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement