ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): లక్ష్యానికి శ్రమ తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మిన బాలుడు తన ప్రయాణంలో ఉత్తమ స్థానానికి చేరుకున్నాడు. క్రికెట్‌పై ఉన్న ఇష్టం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపనతో గంటల కొద్దీ చేసిన ప్రాక్టీస్ ఫలితానిచ్చింది. మనది కాని దేశం.. కొత్త మనుషుల మధ్య ప్రాక్టీస్‌నే నమ్ముకొని అండర్–14 సీబీఎస్‌ఈ నేషనల్ టీమ్ వరకు చేరుకున్నాడు. 14 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో చిచ్చరపిడుగులా రాణిస్తున్నాడు. ఒమన్ అండర్–14 సీబీఎస్‌ఈ క్రికెట్ టీమ్‌కు ప్రవాసీ తెలంగాణ కుటుంబానికి చెందిన బాలుడు కొండేటి పార్థు ఎంపికయ్యాడు. అక్టోబర్ 24 నుంచి 31వ తేదీ వరకు ఇండియాలో జరిగే టోర్నమెంట్‌లో ఒమన్ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ టోర్నీకి ఒమన్ నుంచి ఇండియాకు అక్టోబర్ 22న చేరుకోనున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇండియాలోని 8 జోన్ల నుంచి 8 జట్లు పాల్గొంటుండగా.. జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) నుంచి కూడా కొన్ని జట్లు పాల్గొంటున్నాయి. కొండేటి పార్థు ఒమన్ అండర్–14 సీబీఎస్‌ఈ క్రికెట్ టీమ్ తరఫున ఆడనున్నారు. తమిళనాడు రాష్ట్రం మధురై పోటీలు జరుగనున్నాయి.
నారాయణపూర్ నుంచి ఒమన్‌కు..
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన కొండేటి దేవేందర్–సంజన దంపతుల పెద్ద కుమారుడు కొండేటి పార్థు. 2022 నుంచి దేవేందర్ కుటుంబంతో సహా ఒమన్ దేశంలో ఉంటున్నారు. అక్కడి వాడికబీర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. పార్థు ఇండియన్ స్కూల్ ఆఫ్ వాడికబీర్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. 3వ తరగతి నుంచి క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. తొలుత ఇండియన్ స్కూల్ ఆఫ్ వాడికబీర్ టీమ్ తరఫున ఆడి ప్రధాన బౌలర్‌గా రాణించాడు. క్రమక్రమంగా పాఠశాల టీమ్ నుంచి ఒమన్ దేశం సీబీఎస్‌ఈ అండర్– 14 టీమ్‌కు ఎంపికయ్యాడు. ఐదేళ్లుగా ఉదయం, సాయంత్రం గంటలకొద్దీ చేసిన ప్రాక్టీస్ ఫలితమిచ్చిందని పార్థు తండ్రి దేవేందర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఉత్తమ ప్రదర్శనే లక్ష్యం
ఇన్నాళ్ల కృషి ఫలించింది. అండర్–14 సీబీఎస్‌ఈ నేషనల్ టీమ్‌కు ఎంపికవడం సంతోషంగా ఉంది. అక్టోబర్ 24 నుంచి మధురైలో జరిగే టోర్నమెంట్‌లో బౌలర్‌గా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా.
– కొండేటి పార్థు, సీబీఎస్‌ఈ అండర్–14 క్రికెటర్
అండర్–14 సీబీఎస్‌ఈ క్రికెట్ జట్టుకు ఎంపిక
ఒమన్ అండర్–14 నేషనల్ టీమ్ తరఫున ప్రాతినిధ్యం
అక్కడే స్థిరపడిన కుటుంబం
అక్టోబర్ 24 నుంచి ఇండియాలో టోర్నమెంట్
మధురై వేదికగా పోటీలు


