సిరిసిల్లటౌన్: కడుపునొప్పితో బాధపడుతున్న రైతుకు సరైన సమయంలో సరైన వైద్యం అందకపోవడంతో మృతిచెందిన సంఘటన గురువారం సిరిసిల్లలో వివాదాస్పదమైంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు. తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లికి చెందిన కె.ఆంజనేయులు(49) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి కడుపునొప్పి రాగా కుటుంబ సభ్యులు పాతబస్టాండు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. సదరు వైద్యుడు పరీక్షలు చేసి అడ్మిట్ చేసుకుని కార్డియాలజిస్టుతో 2డీ ఏకో పరీక్షలు చేయించి కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రి వైద్యుడు మాత్రం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్, ఇతర స్పెషలిస్టు వద్దకు పంపకుండా ఆస్పత్రిలోనే ఉంచారు. ఈక్రమంలో ఆంజనేయులు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
స్పెషలిస్టు సూచన పెడచెవిన పెట్టారు
కార్డియాక్ స్పెషలిస్టు సూచనను ఆస్పత్రి వైద్యుడు పట్టించుకోకుండా రెఫర్ చేయలేదని బంధువులు ఆరోపించారు. ఈవిషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి తరలివచ్చారు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే ఆంజనేయులు చనిపోయాడని ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు నందు(19), సింధు(15), శివగణేశ్(12), వెంకటరమణ(08) ఉన్నారు. ఆస్పత్రి వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ.. రోగికి హఠాత్తుగా గుండెపోటు రావడంతోనే చనిపోయాడని, తాము ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని వివరించారు.
సిరిసిల్ల ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం
సరైన వైద్యం అందక రైతు మృతి
కార్డియాలజిస్టు చెప్పినా అందించని వైద్యం
ఆస్పత్రి ఎదుట బంధువుల ధర్నా


