సిరిసిల్ల/కరీంనగర్‌స్పోర్ట్స్: పట్టుదలతో ఆడి బీసీసీఐ టోర్నమెంట్ వరకు చేరుకుంది జిల్లాకు చెందిన పన్యాల అక్షయరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లికి చెందిన బిల్డర్ పన్యాల తిరుపతిరెడ్డి కూతురు. కరీంనగర్‌లోని వీజేఆర్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. బీసీసీఐ టోర్నమెంట్స్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల హెచ్‌సీఏ అండర్–19 ఉమెన్ జట్టులో చోటు సంపాదించుకుంది.
బ్యాటర్‌గా రాణిస్తూ..
కరీంనగర్‌లో నిర్వహించిన హెచ్‌సీఏ క్రికెట్ ట్రయల్స్‌లో తన అసాధారణ ప్రతిభతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక లీగ్ బరిలోకి దిగింది. హైదరాబాద్‌లో సూపర్ 20 జట్ల మధ్య జరిగిన మొదటి రౌండ్ పోటీలలో బ్యాటర్‌గా తనదైన ముద్ర వేసుకుంది. ప్రిలిమినరీ రౌండ్లలో బ్యాట్‌తో రాణించగా సూపర్ 8 లీగ్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా అక్షయను నియమించారు. అనంతరం జరిగిన సూపర్ 4 లీగ్‌లోనూ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి తన ఆట తీరుతో ఆకట్టుకుంది. అద్భుతమై ఫామ్‌లో ఉమ్మ అక్షయను ఏకంగా 15 మంది సభ్యుల హెచ్‌సీఏ స్టేట్ స్క్వాడ్‌లో నిలబెట్టింది. జిల్లాలోని ప్రతీ యువ క్రికెటర్‌కు ఒక గొప్ప స్ఫూర్తి అని ఆమె ప్రగతిపై కేడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఆగంరావు, మనోహర్‌రావు, మహేందర్, మురళీధర్‌రావు అభినందించారు.


