గళం విప్పితే షోకాజ్‌! | - | Sakshi
Sakshi News home page

గళం విప్పితే షోకాజ్‌!

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

ఇద్దరు కార్పొరేటర్లకు నోటీసులు

జీజీహెచ్‌లో దురుసు ప్రవర్తనపై ఫిర్యాదులే కారణమంటున్న అధికారులు

మేడారం నుంచి నోటీసుల వరకు ఆసక్తిర పరిణామాలు

రసవత్తరంగా రామగుండం కార్పొరేషన్‌ రాజకీయం

సాక్షి,పెద్దపల్లి: రామగుండం కార్పొరేషన్‌లో రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష షోకాజ్‌ నోటీసులు జారీచేయడం చర్చనీయాంశమైంది. జీజీహెచ్‌(గోదావరిఖని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌)లో వైద్యులు, సిబ్బందితో దురుసుగా వ్యవహరించారన్న ఫిర్యాదులపై నోటీసులు జారీఅయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపల్‌ చట్టం–2019లోని సెక్షన్‌ 66 ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసుల్లో ఆదేశించారు. అధికార పార్టీలోనే ఉంటూ జిల్లా అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్న కార్పొరేటర్లకు నోటీసులు రావడంపై రాజకీయ వర్గాల్లో భిన్నచర్చ సాగుతోంది. నోటీసులు కేవ లం ఫిర్యాదుల ఆధారంగానే జారీచేశారా? లేక అధికారులతో కార్పొరేటర్లకు ఉన్న విభేదాలు, ఇ టీవలి పరిణామాలు కారణమా? అనే ప్రశ్నలు త లెత్తుతున్నాయి. అధికారుల తదుపరి నిర్ణయంతోనే వీటిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

నిలదీస్తే నోటీసులా?

రామగుండం బల్దియాలో ప్రజాప్రతినిధులు, యంత్రాంగం మధ్య సమన్వయంపై కొంతకాలంగా చర్చ సాగుతోంది. ఇటీవల 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ కౌటం సతీశ్‌ కమిషనర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన సమయంలో అటెండర్‌ ద్వారా బయటకు పంపించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు పా ల్గొనడం చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే తాజాగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లకు షోకాజ్‌ నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతోందా? అనే చర్చకు ఇది దారితీసింది.

మేడారం పర్యటనపైనా చర్చ

రామగుండం కార్పొరేషన్‌లో రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు కలిసి చర్చించుకోవడం కొత్తేమీ కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కలిసి మేడారం వెళ్లడం కూడా చర్చకు దారితీసింది. కొందరు దీనిని ఆధ్యాత్మిక పర్యటనగా పేర్కొనగా.. మరికొందరు కార్పొరేషన్‌లోని సమస్యలు, అధికారుల తీరుపై చర్చించుకునేందుకు ఏర్పడిన అవకాశంగా అభివర్ణించినా.. తెరవెనుక ఏదో జరుగుతుందనే భావన నెలకొంది.

అసంతృప్త్తితోనే గీత దాటుతున్నారా?

బల్దియాలో మరో ఆసక్తికరమైన రాజకీయ సమీకరణపై చర్చ జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు కూడా అధికారుల తీరును బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. కొన్నిసందర్భాల్లో ప్రతిపక్ష కార్పొరేటర్లతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఆస్పత్రుల్లో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు మూలన పడిఉండటాన్ని ప్రశ్నించారు. పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రజాప్రతినిధులుగా ప్రశ్నిస్తే నోటీసులు ఎలా జారీ చేస్తారని చర్చించుకుంటున్నారు. కార్పొరేటర్ల అసంతప్తికి కేవలం అధికారుల వ్యవహారశైలే కారణమా? లేక రాజకీయ నాయకత్వంతో సమన్వయ లోపం కూడా ఉందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇద్దరి వివరణలతో మరింత ఆసక్తి

తాజాగా నోటీసులు అందుకున్న ఒకటో డివిజన్‌ కార్పొరేటర్‌ మడిపల్లి విజయ, 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ సాగి సంతోష్‌కుమార్‌ ఇప్పటికే కలెక్టర్‌కు తమ వివరణ సమర్పించినట్లు సమాచారం. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, రాజకీయ కక్షతోనే తమపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు వచ్చిన సమయంలో తాను జీజీహెచ్‌ ప్రాంగణంలోనే లేనని విజయ పేర్కొన్నట్లు సమాచారం. సంతోష్‌కుమార్‌ కూడా తనకు అనారోగ్యంగా ఉండటంతో ఇంటికే పరిమితమయ్యానని, ఆరోపణల సమయంలో ఆస్పత్రికి వెళ్లలేదని వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరి వివరణలను అధికారులు పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

నోటీసులతోనే ముగుస్తుందా?

కార్పొరేటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీచేయడం పరిపాలనా ప్రక్రియలో భాగమేనని అధికారులు చెబుతున్నా.. రాజకీయ వర్గాల్లో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. వివిధ పార్టీల కార్పొరేటర్లు గతంలోనూ కొన్నిఅంశాలపై కలిసి పనిచేసిన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు వారి మధ్య సమన్వయాన్ని మరింత పెంచుతాయా? లేక రాజకీయంగా దూరం పెంచుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా జీజీహెచ్‌ వ్యవహారంతో మొదలైన షోకాజ్‌ నోటీసుల అంశం.. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల మధ్య సంబంధాలపై మరోసారి చర్చకు తెరతీసింది. తదుపరి అధికారిక నిర్ణయంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement